పుచ్చలపల్లి సుందరయ్య.. నీకు సాటిలేరయ్యా! 

26 Mar, 2019 08:33 IST|Sakshi

ఆయన సత్యాన్ని మాత్రమే నమ్మేవాడు.  అదే మాట్లాడేవాడు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేవాడు. ప్రజా సమస్యలపై శివమెత్తేవాడు. సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా నిలదీసి అడిగేవాడు. అవసరమైతే కడిగేసే వాడు. ఎంపీగా ఉన్నా సైకిల్‌పైనే సభకు వెళ్లేవాడు. నిలువెల్లా నిరాడంబరతను నింపుకున్న ఆయన విలువల్లోనూ అగ్రభాగాన నిలిచారు. ఆయనే పుచ్చలపల్లి సుందరయ్య

1952.. న్యూఢిల్లీ.. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, సభలో ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉన్నారు. ఉన్నట్టుండి ఓ గొంతు ఖంగుమంది.

‘అధ్యక్షా.. లేడీ మౌంట్‌ బాటన్‌ భారత పర్యటనకు ఎందుకు వస్తున్నారో ప్రధానమంత్రి నెహ్రూ చెప్పాలి. మన అంతర్గత వ్యవహారాలలో బ్రిటిష్‌ వాళ్ల  జోక్యాన్ని మేం అంగీకరించబోం’ అంటూ ప్రతిపక్ష నాయకుడు, సీపీఐ పార్లమెంటరీ పక్షనాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సభలో మండిపడుతున్నారు. 

నెహ్రూ అదే స్థాయిలో.. ‘సుందరయ్య గారూ. మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి’ అన్నారు. ‘నేనెందుకు ఉపసంహరించుకోవాలి. అసలింతకీ ఆమె ఎందుకు వస్తోంది? మన వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి కాకపోతే ఇప్పుడామెకు ఇండియాలో ఏం పని’ అని సుందరయ్య అనటం తో సభలో దుమారం చెలరేగింది. సుందరయ్య పట్టు వీడలేదు. సంయమనం పాటించాలని, సహనం కోల్పోవద్దన్న సర్వేపల్లి ఆదేశంతో గొడవ సద్దుమణిగింది.
 
ఆ మర్నాడు ఉదయం సుందరయ్యను సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అల్పాహారానికి ఆహ్వానించారు. మాటల మధ్యలో సుందరయ్యకు అసలు విషయం తెలిసింది. ’నెహ్రూకు అంత కోపం ఎందుకొచ్చిం దో నీకు తెలిసినట్టు లేదు. లేడీ మౌంట్‌ బాటన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు అందరూ మాట్లాడుకోవడం నెహ్రూకు నచ్చదు. అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది’ అని సర్వేపల్లి చెప్పారు. సుందరయ్య ఖంగుతిన్నారు. ’అయ్యో.. నేను అనవసరంగా మాట్లాడానే. సారీ.. నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు సర్‌. నాకీ విషయం తెలిసుంటే ప్రశ్నలను మరోలా అడిగేవాణ్ణి’ అని చిన్నబుచ్చుకున్నారు. ఇది జరిగిన మర్నాడే నెహ్రూ తన ఇంటికి రాజ్యసభ సభ్యుల్ని డిన్నర్‌కు పిలిచారు. సుందరయ్య కూడా వెళ్లారు. ఆయన్ను చూసిన నెహ్రూ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడబోతుండగా.. ’సారీ మిస్టర్‌ నెహ్రూ. నిన్న సభలో జరిగిన దానికి బాధపడుతున్నా’ అని తీవ్ర ఆవేదనతో అన్నారు. నెహ్రూ సైతం అంతే క్రీడాస్ఫూర్తితో ఓ చిర్నవ్వు నవ్వి ’నేనూ సారీ చెబుతున్నా సుందరయ్య గారూ. నేను కూడా అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది’ అన్నారు. ఆ తర్వాత ఏ విషయం వచ్చినా సుందరయ్యను ఆదర్శంగా తీసుకోమని నెహ్రూ పదేపదే తన పార్టీ సభ్యులకు చెబుతూ వచ్చేవారు. 

సాధికారత ఆయన సొంతం 
చట్టసభలలో మాట్లాడేటప్పుడు చదవకుండా, పూర్వపరాలు, ప్రభావం, పర్యావసానాలు తెలుసుకోకుండా సుందరయ్య సభకు వచ్చేవారు కాదు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మేధావులు, నిపుణులతో పాఠాలు చెప్పించే వారు. అంకెలు, సంఖ్యలతో సభకు వెళ్లమని చెప్పేవారు. మద్రాసు శాసనసభ నుంచి సుందరయ్య 1952లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు ఆయనే సీపీఐ పార్లమెంటరీ నేత. ఉభయ సభలలో సీపీఐ పార్లమెంటరీ పార్టీ సభా నాయకుడు కూడా. ఆనాడు ఆంధ్రా నుంచి 17 మంది కమ్యూనిస్టులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తే సుందరయ్య పార్టీ నేతగా ఢిల్లీలో ఉండి అన్నీ చక్కబెట్టేవారు. 

మారుమూల పల్లె నుంచి.. 
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1న 1913లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో సుందరయ్య జన్మించారు. వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతుల ఆరో సంతానం. సుందరరామిరెడ్డి అని తల్లిదండ్రులు పేరు పెడితే కులం ముద్ర ఉండకూడదనుకుని పేరు చివర్న రెడ్డిని తొలగించుకున్నారు. ఓ అన్న, నలుగురు అక్కల తర్వాత పుట్టిన వాడు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. ఆయన తర్వాత ఓ తమ్ముడు డాక్టర్‌ రామచంద్రారెడ్డి పుట్టినప్పటికీ ఆ కుటుంబంలో సుందరయ్యది ప్రత్యేక స్థానమే. వీధి బడిలో చదివారు. పెద్ద బాలశిక్ష ఆయన తొలి పాఠ్యపుస్తకం. ఆరేళ్ల వయసులో తండ్రి చనిపోతే తన పెద్దక్క సుందరయ్య, రామచంద్రారెడ్డిని తిరువళ్లూరు తీసుకెళ్లి చదివించింది. మూడు, నాలుగైదు తరగతులు తిరువళ్లూరులో చదివిన సుందరయ్య ఆ తర్వాత ఏలూరు, రాజమండ్రి, చెన్నైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 

పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నారంటే.. 
రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. పీపుల్స్‌ వార్‌ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్న కమ్యూనిస్టు పార్టీ 1942 ప్రాంతంలో ఆ పనిమీద సుందరయ్యను బొంబాయి పంపింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టులు వేర్పాటు వాదులనే ముద్రవేసి అణచివేసింది. నిర్బంధాన్ని కొనసాగించింది. ఆ సమయంలో అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్స్‌తో సంబంధాల కోసం బొంబాయిలోని దిల్సాద్‌ చారీ, ఏఎస్‌ఆర్‌ చారీ అనే పార్టీ నేతల ఇంటికి సుందరయ్య వెళ్లి వస్తుండేవారు. అక్కడ పరిచయమైన లీలా అనే సెంట్రల్‌ బ్యాంక్‌ ఉద్యోగిని 1943 ఫిబ్రవరి 27న పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషీ, మరికొద్ది మంది పార్టీ నేతల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన మరుసటి ఏడాది 1944 చివర్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకున్నారు. పార్టీకి పూర్తి కాలం సేవలు అందించాలనే ఉద్దేశంతో  పిల్లలకు దూరంగా ఉండిపోయిన ఆ జంట పెళ్లి చేసుకుని, పరిమిత సంతానాన్ని కని సుఖంగా ఉండమని మాత్రం పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించేవారు. 

సర్వస్వం పార్టీకే అంకితం 
తన వాటా కింద వచ్చిన యావదాస్తిని ప్రజా ఉద్యమాల కోసం సుందరయ్య ఖర్చు చేశారు. ఆయన అనేక విలువైన పుస్తకాలను రచించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, తెలంగాణ ప్రజా పోరాటం–కొన్ని గుణపాఠాలు, ఆత్మకథ వంటివి వాటిలో కొన్ని. 1952లో రాజ్యసభ సభ్యునిగా, 1955 నుంచి 1967, 1978 నుంచి 1983 వరకు రెండుసార్లు రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు, సలహాలు, వాదనలు ఇప్పటికీ విలువైనవే. అందరూ కార్లు వాడుతున్న కాలంలో పార్లమెంటుకు, అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లిన అతి సామాన్యుడు. 1985 మే 19న మరణించే వరకు ఆయన ప్రజల కోసం అహరహం శ్రమించారు. పేదరికం, దోపిడీ నుంచి పేదల విముక్తికి జీవితాన్ని అంకితం చేసిన మచ్చలేని మహామనిషి, దేశభక్తుడు. ఆకలి, దారిద్య్రం లేని సమసమాజం కోసం పోరాడిన విప్లవకారుడు. బడుగు, బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతి.  

17 ఏళ్ల వయసులోనే అరెస్ట్‌ 
విద్యార్థి దశనుంచే ఆదర్శ భావాలు, త్యాగనిరతి పుణికి పుచ్చుకున్న సుందరయ్య 1930 ఏప్రిల్‌లో మహాత్మాగాంధీ పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్‌ అయ్యారు. మైనారిటీ తీరకపోవడంతో ఆయన్ను రాజమండ్రిలోని బోస్టన్‌ స్కూల్‌కు తరలించారు. అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వస్తూనే వ్యవసాయ కార్మికులను ఏకం చేసి భూస్వాములపై తిరుగుబాటు చేశారు. తన ఆత్మకథలో చెప్పుకున్నట్టుగా సుందరయ్యను కమ్యూనిస్టుగా తీర్చిదిద్దిన వారిలో అమీర్‌ హైదర్‌ ఖాన్‌  ప్రథములు. సామాన్య కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత అదే పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే పనిని తన భుజానికెత్తుకున్నారు. 1943లో బొంబాయిలో జరిగిన పార్టీ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన సుందరయ్య మరణించే వరకు ఉమ్మడి పార్టీలోనూ ఆ తర్వాత ఏర్పడిన సీపీఐ (ఎం)లో వివిధ హోదాలలో పని చేశారు. 1939, 1942 మధ్య అజ్ఞాత వాసానికి వెళ్లిన సమయంలో సుందరయ్య కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1943లో పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, కలకత్తా థీసిస్‌ ఆధారంగా సాయుధ పోరాటాన్ని ప్రభోదించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. 1948, 1952 మధ్య కాలంలో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు.      

–ఆకుల అమరయ్య, సాక్షి, అమరావతి
 

మరిన్ని వార్తలు