హెచ్‌సీయూలో విద్యార్థులకు షాక్‌

13 Jun, 2019 08:28 IST|Sakshi
చీఫ్‌ వార్డెన్‌ కార్యాలయం ముందు బైఠాయించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేత

ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు

పరీక్షలు అయ్యే వరకు హాస్టళ్లు మూసేయొద్దని డిమాండ్‌

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పలు హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను బుధవారం నిలిపివేశారు. వేసవి కావడంతో నీటి సమస్య ఉందని దీంతోపాటు సెలవులుండడంతో కొన్ని హాస్టళ్లను మూసివేయాలని చీఫ్‌ వార్డెన్‌ వాసుకి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు క్యాంపస్‌లోని ఎల్‌హెచ్‌–8, ఎంహెచ్‌ ఎల్‌ అండ్‌ ఐ హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. వాటిలో ఉండే విద్యార్థులు ఇతర హాస్టళ్లకు మారాలని సూచించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మూడు రోజుల క్రితం కూడా ఇలాగే నీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేయగా విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పునరుద్ధరించారు. ప్రస్తుతం క్యాంపస్‌లో సీఎస్‌ఐఆర్, జేఆర్‌ఎఫ్, నెట్‌ పరీక్షల కోసం పలువురు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వీరిని ఇబ్బంది పెట్టకుండా పరీక్షలు అయ్యేంత వరకు విద్యుత్, నీటి సరఫరా కొనసాగించాలని విద్యార్థి యూనియన్లుడిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే సమాచారం ఇచ్చామని, వేసవిలో సెలవుల దృష్ట్యా కొన్ని హాస్టళ్ల మూసి వాటిలో ఉండేవారికి తెరిచి ఉంచే హాస్టళ్లలో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.  

ఓబీసీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బైఠాయింపు
హెచ్‌సీయూ క్యాంపస్‌లోని చీఫ్‌ వార్డెన్‌ కార్యాలయం ముందు ఓబీసీ ఫెడరేషన్‌ ముందు ఆ విద్యార్థి సంఘం నాయకులు బైఠాయించారు. అక్కడే కూర్చొని చదువుకోవడం ప్రారంభించారు. సీఎస్‌ఐఆర్, జేఆర్‌ఎఫ్, నెట్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఓబీసీ ఫెడరేషన్‌ నాయకులు నినాదాలు చేశారు. నీరు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో ఓబీసీ ఫెడరేషన్‌ నాయకులు రవికుమార్‌ యాదవ్, ధీరజ్‌ సంగోజి, శ్రీరామ్‌ పట్లోళ్ళ, సాయికుమార్, షేక్‌ హుస్సేన్, దాసరి అభిలాష్, చిన్మయ సుబుద్ధి, మణిసాయి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన
మరోపక్క చీఫ్‌ వార్డెన్‌ కార్యాలయం ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నిలిపివేసిన విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నినాదలు చేశారు. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, హాస్టల్‌ ఎల్‌అండ్‌ఐ హాస్టల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు