‘పవర్’ పంచాయితీ

3 Nov, 2014 03:18 IST|Sakshi

ఇందూరు: పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామపంచాయతీలకు సంబంధించిన కరెంటు బిల్లుల పంచాయితీ ముదురుతోంది. బిల్లులు కట్టకుంటే గ్రామాలలో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేసిన విద్యుత్ శాఖను తప్పుబట్టాలో, లేదా బకాయిలు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలో తెలియక 718 గ్రామాల సర్పంచులు అయోమయంలో పడిపోయారు.

విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఏ ఒక్క పంచాయతీ పరిధిలో విద్యుత్ కనెక్షన్ తొలగించినా ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. పరిష్కారం లభించకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టం చేస్తున్నారు.

 ఏం జరిగింది
 ఎప్పటి మాదిరిగా కరెంటు బిల్లుల బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని సర్పంచులు భావించారు. కానీ, ప్రభుత్వం బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో జిల్లాలో రూ.117 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. చాలా రోజులు వేచి చూసిన విద్యుత్ అధికారులు, వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే కనెక్షన్‌లు తొ లగిస్తామని 718 పంచాయతీల సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కనెక్షన్‌లు తొలగిస్తున్నారు కూడా.

మీటర్ రీడింగ్ ప్రకారం కాకుండా  అడ్డగోలుగా బిల్లులు వేశారని, విద్యుత్ చౌర్యం బిల్లులు కూడా అందులో కలిపారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాల్సిన అధికారులు తమను తాము తప్పించుకోవడానికి పంచాయతీలపై భారం మోపడం సరికాదని విమర్శిస్తున్నారు. ఇపుడు ఏకంగా కనెక్షన్‌లు తొలగిస్తే, గ్రామాలు అంధకారంలో మునిగిపోతా యని, మంచినీటి పథకాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు.

 ఆదాయం లేదు... ఆసరా లేదు
 జిల్లాలో 718 పంచాయతీలున్నాయి. ఇందులో 74 మేజర్, 644 మైనర్ పంచాయతీలు. మేజర్ పంచాయతీలు రూ.53 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.63.88 కోట్లు బకాయి పడినట్లుగా విద్యుత్ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పంచాయతీలకు సంబంధించిన కరెంట్ బకాయిలు చెల్లించేది.

రెండు సంవత్సరాలుగా కట్టకపోవడంతో ఆ భారం పంచాయతీలపై పడింది. ఆ మధ్య మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన బకాయిలు తామే చెల్లిస్తామని, మైనర్ పంచాయతీలు వారే కట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, ఆధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదు. రోజులు గడిచిన కొద్దీ బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓసారి బిల్లు లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల సాయంతో విద్యుత్ అధికారులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం విద్యుత్ అధికారులు ఎవరి మాటా వినడం లేదు. ఫలితంగా పంచాయతీలకు బకాయిల సమస్య తీవ్రమైంది. పంచాయతీల నుంచైన చెల్లిద్దామంటే అంతగా ఆదా యం లేదు. వచ్చిన నిధులు, పన్నులు కార్మికుల జీతాలు, పంచాయతీ నిర్వహణ, ఇతర ఖర్చులకే సరిపోతున్నాయి.

 నేడు కలెక్టర్ చెంతకు పంచాయితీ
 బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి తేవడం, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్‌ను కలవాలని నిర్ణయించుకున్నామని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోర్త రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం 80ని ఆయన దృష్టికి తెస్తామన్నారు. అందులో పేర్కొ న్న విధంగా బకాయిలను సర్కారు చెల్లించే విధంగా చూడాలని కోరతామన్నారు.

మరిన్ని వార్తలు