నిర్దాక్షిణ్యంగా నిండు గర్భిణి గెంటివేత

7 Jan, 2016 03:45 IST|Sakshi
నిర్దాక్షిణ్యంగా నిండు గర్భిణి గెంటివేత

మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం
 సంగారెడ్డి టౌన్: ఓ నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన ఘటన బుధవారం మెదక్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలానికి చెందిన కవిత నిండు గర్భిణి. డెలివరీ కోసం సోమవారం సం గారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. కవితకు సిజేరియన్ చేస్తామని చెప్పిన వైద్యులు.. రక్తం తక్కువగా ఉందని, వేరే ఆసుపత్రికి వెళ్లాలని బుధవారం బయటకు పంపి తలుపులు వేసేశారు. ఏమి చేయాలో తోచక  ఆసుపత్రి ఆవరణలోనే ఉండిపోయింది. ఆమె లోపలికి వస్తుందేమోనని సిబ్బంది గంటలకొద్దీ తలుపులు మూసేశారు. దీంతో ఆ వార్డులోని బాలింతలు, గర్భిణుల సహాయకులు బయటే ఉండిపోయారు.
 
 ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలనే: గర్భిణి తల్లిదండ్రులు
 కవిత ఆరు నెలలుగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకుంటోందని ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, రంగయ్య తెలి పారు. సంగారెడ్డిలోని ఆ డాక్టర్‌కు చెందిన ప్రైవేటు ఆసుపత్రిలో ప్రతి నెలా వైద్యపరీక్షలు చేయించుకుందన్నారు. పేదరికం కారణంగా డెలివరీ కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిందని తెలిపారు. తీరా సిజేరియన్‌వేళ రక్తం లేదంటూ తమ కూతురును బయటికి వెళ్లగొట్టారని వారు కంట తడిపెట్టారు.
 
 ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడికి పంపాలనే ఉద్దేశంతో ఆసుపత్రి సిబ్బంది ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.  ‘ఆస్పత్రి లోపల ఆపరేషన్ అయిన బిడ్డ ఒక్కతే ఉంది. పొద్దున్నుంచి తలుపులు తెరుస్తలేరు.’ అని  ఓ బాలింత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై   ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయ త్నించగా వైద్యులెవరూ ముందుకు రాలేదు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
 

మరిన్ని వార్తలు