సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

23 Dec, 2018 09:35 IST|Sakshi
తలసేమియా వార్డును ప్రారంభిస్తున్న రాష్ట్రపతి, గవర్నర్లు..

మెడికల్‌ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోంది. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావాలి. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: వైద్యరంగంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 23న కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రజలకు ఒక వరమని అన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కరీంనగర్‌ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (పిమ్స్‌)లో శనివారం సికిల్‌సెల్, తలసేమియా చికిత్స కేంద్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. వైద్య విద్యలో అత్యంత ప్రతిభ చూపిన ఐదుగురు మెడికోలకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ప్రతిమ ఆడిటోయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మెడికోలు, వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మెడికల్‌ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. దేశంలో పోలియో, స్మాల్‌ఫాక్స్‌ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, అదే తరహాలో తలసేమియా వ్యాధి నిర్మూలనకు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం గల కరీంనగర్‌కు రావడం ఇదే ప్రథమని, ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు.

ఒకప్పుడు ఒక్కరే.. ఇప్పుడు మూడు, నాలుగు కోట్ల మంది : మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు
తలసేమియా దేశాన్ని కంగదీసే వ్యాధి అని మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. 1938లో దేశంలో ఒక్కకేసే నమోదైతే... ఇప్పుడా సంఖ్య మూడు నుంచి నాలుగు కోట్లకు చేరిందన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందన్నారు. తలసేమియా విషయంలో భారతావని అప్రమత్తం కావాలన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి కోసం 2లక్షల యూనిట్లు అవసరమని తెలిపారు. బాధితులకు ఉచిత రక్తమార్పిడి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేనరికం వల్ల మాత్రమే తలసేమియా వస్తుందనుకుంటే పొరపాటని, ఇప్పుడు అందరికీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతీ యువకులు పెళ్లికి ముందు రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు.

అందరూ కృషి చేస్తేనే ఆరోగ్య తెలంగాణ: గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌
ఒక మంచి ఆశయం, లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. పట్టణ ప్రాంతాలకు తోడు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణలం తా ఆరోగ్యంగా ఉండాలన్నారు. తలసేమియా, సికెల్‌సెల్‌ తదితర వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్యోగవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం అందరి కృషి అవసరమన్నారు.  రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ, కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఆసుపత్రి చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు మందు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పోలీస్‌ కమిషనర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్‌లను హెలిప్యాడ్‌ వద్ద కలిసి స్వాగతం పలికారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా