మల్టీ దోపిడీ!

30 Oct, 2017 11:15 IST|Sakshi

తినుబండారాలు కొంటే జేబుకు చిల్లే

అర లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.50

ఒక్కో సమోసా రూ.50.. చాయ్‌ రూ.130

అరగ్లాస్‌ కూల్‌ డ్రింక్‌ రూ.210

పాప్‌కార్న్‌ రూ.215

నివ్వెరపోతున్న సినీ ప్రేక్షకులు

‘సేల్స్‌ సెలెక్టివ్‌ చానెల్‌ ఓన్లీ’ ఆప్షన్‌ ఆధారంగా సొంత ధరలు

ఎంఆర్‌పీ ఇక్కడ బేఖాతరు

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు

చోద్యం చూస్తున్న అధికారగణం

మల్టీప్లెక్స్‌లలో ధరల మాయాజాలం నడుస్తోంది. రొటీన్‌కు భిన్నంగా సినీ‘మాల్స్‌’లో మూవీ చూద్దామని వెళ్తున్న ప్రేక్షకుల జేబులకు చిల్లు పడుతోంది. టిక్కెట్‌ ధరల నుంచి పార్కింగ్‌..తినుబండారాల ధరలు ప్రేక్షకులను గడగడలాడిస్తున్నాయి. ‘బాబోయ్‌...మరోసారి ఇక్కడికి రావొద్దు..’అనే స్థాయికి తీసుకువస్తున్నాయి. ఒక్కో వస్తువు ధర బయటి ధరల కంటే పది..ఇరవై రెట్లు ఎక్కువగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. పది రూపాయల పాప్‌కార్న్‌ ధర రూ.215 ఉందంటే పరిస్థితి ఏ రీతిన ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ధరలు నియంత్రించాల్సిన అధికారగణం నిర్లక్ష్యం వహిస్తోందని సగటు ప్రేక్షకుడు ఆరోపిస్తున్నాడు. గ్రేటర్‌లోని పీవీఆర్‌..బిగ్‌ సినిమాస్‌.. ఐనాక్స్‌.. ఐమాక్స్‌.. ఇలా అన్ని మల్టీప్లెక్స్‌ థియేటర్లలోనూ ధరల దోపిడీ కొనసాగుతోంది.
            
– బంజారాహిల్స్‌     
 -సీన్‌ వన్‌...

యూసుఫ్‌గూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని మల్టీప్లెక్స్‌లో  సినిమాకు వెళ్లాడు. సినిమా విరామ సమయంలో పిల్లలకు పాప్‌కార్న్‌ తెద్దామని ఫుడ్‌ కోర్టుకు వచ్చాడు. పావుకిలో బరువున్న పాప్‌కార్న్‌ ధర రూ.215 అని చెప్పడంతో నివ్వెరపోయాడు. అంతేకాకుండా అర లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.50, రెండు సమోసాలకు రూ.100 ధర ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. చేసేదేమీ లేక వాటిని కొనుగోలు చేశాడు. బయట రూ.10 మాత్రమే విలువ చేసే పాప్‌కార్న్‌ను ఏకంగా రూ. 215కు అమ్మడం ఏంటో అర్థం కాక నిట్టూరుస్తూ వచ్చి సీట్లో కూర్చున్నాడు.

-సీన్‌ టు..
బేగంపేటకు చెందిన యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి నెక్లెస్‌రోడ్‌లో మల్టీప్లెక్స్‌ థియేటర్‌కు వచ్చాడు. వెజ్‌బర్గర్‌ కోసం రూ.160 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక కూల్‌ డ్రింక్స్‌ ఒక్కోదానికి  రూ. 210 ఖర్చుచేయాల్సి వచ్చింది. సినిమా చూసిన ఆనందం కంటే జేబుకు పడ్డ చిల్లును చూసి ఉసూరుమంటూ బయటకు వచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో యథేచ్ఛగా ప్రేక్షకులను దోచుకుంటున్నారు.  

బంజారాహిల్స్‌:  బంజారాహిల్స్‌ రోడ్‌నం 2లోని ఆర్‌కే సినీప్లెక్స్‌లోని పీవీఆర్‌ సినిమాస్‌లో కూల్‌డ్రింక్స్, వాటర్‌ బాటిళ్లు, పాప్‌కార్న్‌ పేరుతో ప్రేక్షకులను అడ్డంగా దోచుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. నెక్లెస్‌ రోడ్డులోని ఐమాక్స్, బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1లోని జీవీకే మాల్‌లోని ఐనాక్స్, పంజగుట్ట హైదరాబాద్‌ సెంట్రల్‌లోని పీవీఆర్‌ సినిమాస్, అమీర్‌పేటలోని బిగ్‌ సినిమాస్, కూకట్‌పల్లిలోని సుజనా ఫోరమ్‌ మాల్, కాచిగూడలోని  బిగ్‌ సినిమాస్‌.. ఇలా ఎక్కడ చూసినా దోపిడీ కొనసాగుతూనే ఉంది. రూ.10కి దొరికే పాప్‌కార్న్‌ను ఆకర్షణీయమైన ప్యాక్‌లో వేసి రూ.215కు అమ్ముతున్నారు. ఇక ఇరానీ హోటల్‌లో రూ.10కి ఒకటి చొప్పున దొరికే సమోసాలకు ఏ మాత్రం తీసిపోకుండా అందమైన బాక్సుల్లో పెట్టి రూ.50కి అమ్మడం మల్టీప్లెక్స్‌ నిర్వాహకులకే చెల్లింది.

అంతా మా ఇష్టం...
ఏదైనా వస్తువు కానీ తినుబం«డారాలు కానీ తయారు చేసి వాటిని విక్రయించేందుకు ఎమ్మార్పీని నిర్ణయిస్తారు. ఆ వస్తువు నాణ్యత, ముడి పదార్థాల విలువకు కొంతమేర లాభాన్ని జోడించి ఎమ్మార్పీ నిర్ణయిస్తారు. అయితే మల్టీప్లెక్స్‌ల్లో వీటిని నిర్ణయించే తీరు మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉదాహరణకు ఆలుగడ్డ, మైదాపిండి తదితర వస్తువులతో తయారు చేసే సమోసాను సుమారు రూ.10 నుంచి రూ.15 ఖర్చుతో తయారు చేçస్తుంటారు. ఈ సమోసాలను ఏకంగా రూ.50కి అమ్మడం ఎంతవరకు సమంజసం అని సాధారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.  

నామమాత్రపు దాడులు..   
ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తున్నా...నిలువరించే అధికారం తమకు లేదని తూనికలు కొలతల శాఖ చేతులెత్తేస్తోంది. అడ్డగోలుగా రేట్లను నిర్ణయించి అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు లేకుండాపోయింది. కేవలం ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించినపుడు, లేదా కొలతల్లో వ్యత్యాసం ఉంటేనే తాము దాడులు చేయగలమని వారు అంటున్నారు. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం మినహా గట్టి చర్యలు తీసుకునే అధికారం ఈ శాఖకు లేదని మాల్స్‌ నిర్వాహకులకు తెలియడంతో వారి ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ‘సేల్స్‌ సెలెక్టివ్‌ చానెల్‌ ఓన్లీ’ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకుని సొంతంగా ఎమ్మార్పీలు నిర్ణయించుకుని అధిక ధరలకు అమ్ముకునే వీలు ఉండడంతో.. బయట రూ.20కి దొరికే వాటర్‌ బాటిల్‌ మాల్స్, మల్టీ ప్లెక్స్‌లు, ఎయిర్‌పోర్టులు, స్టార్‌ హోటళ్లు తదితర ప్రాంతాల్లో రూ.60గా ప్రింట్‌ చేసుకుని అమ్మేస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలు ప్రాంతాల్లో చీటింగ్‌ కేసులు కూడా నమోదు చేశారు. ఓ రెస్టారెంట్‌లో రూ. 20 ఉన్న వాటర్‌ బాటిల్‌ను రూ. 9 అధికంగా అమ్మిన నిర్వాహకుడిపై మాదాపూర్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో అధిక ధరకు వాటర్‌ బాటిల్‌ అమ్మినందుకు రూ. 20 వేల జరిమానా విధించారు. అలాగే  మలీప్లెక్సుల్లో విక్రయాలపై కూడా నియంత్రణ ఉండాలని, సరైన ధరలకే అమ్మేలా చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

వామ్మో ఇవేం ధరలు..
ఆర్‌కే సినీప్లెక్స్‌లోని పీవీఆర్‌ సినిమాస్‌లో రేట్లు ఇలా ఉన్నాయి..

అరలీటర్‌ వాటర్‌ బాటిల్‌  =  రూ. 50

అరలీటర్‌ పెప్సీ గ్లాస్‌   = రూ. 210

రెండు సమోసాలు   = రూ. 100

పాప్‌కార్న్‌ రెగ్యులర్‌  =  రూ. 230

కోల్డ్‌ కాఫీ   = రూ. 130

టీ  =  రూ. 130

వెజ్‌ బర్గర్‌  =  రూ. 160

చికెన్‌ బర్గర్‌  =  రూ. 170

పన్నీర్‌ టిక్కా  =  రూ. 160

స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నాం...
ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రోడ్డుపక్కన బడ్డీకొట్టు నుంచి స్టార్‌ హోటల్‌లోని రెస్టారెంట్‌ వరకు ఒకేధరకు ప్యాక్‌డ్‌ వస్తువులు విక్రయించేలా చట్టంలో సవరణ అమల్లోకి రానుంది. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది.  
– భాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్‌ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ

మరిన్ని వార్తలు