‘రియల్‌’ డబుల్‌!

30 Jul, 2019 01:52 IST|Sakshi

రాజధాని శివార్లలో రెండేళ్లలో వంద శాతం మేర పెరిగిన ధరలు

ఔటర్‌ చుట్టూ బూమ్‌.. కోట్లు పలుకుతున్న భూములు..

ఐటీ, బీపీఓ, సేవారంగ సంస్థల కార్యకలాపాల పెరుగుదలే కారణం

భూముల ధరలపై కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ అధ్యయనం  

గ్రేటర్‌ శివార్లలో రియల్‌ రంగం రయ్యిమని దూసుకుపోతోంది. ఔటర్‌రింగ్‌ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నివాస భూముల ధర రెండేళ్లలోనే రెట్టింపు అయింది. నూతన ఐటీ, హార్డ్‌వేర్‌ పరిశ్రమల కార్యకలాపాలు పెరగడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొనడం, అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరగడం, ప్రధాన రహదారుల విస్తరణ, హరిత వాతావరణం, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు భారీగా వెలియడంతో ఆయా ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ అనే సంస్థ తాజాగా ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలపై చేసిన అధ్యయనం నిర్వహించి ఇందుకుగల కారణాలను విశ్లేషించింది. 
– సాక్షి, హైదరాబాద్‌

ఆ ప్రాంతాల్లో భూములు బంగారం... 
గతంలో అభివృద్ధి ప్రధాన నగరంలోనే కేంద్రీకృతం కావడంతో భూముల ధరలు ఆయా ప్రాంతాల్లోనే అధికంగా ఉండేవి. ఇప్పుడు అభివృద్ధి గ్రేటర్‌ నలుచెరగులా విస్తరించడం, ఆయా ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణరంగ కార్యకలాపాలు గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరిగాయి. ప్రధానంగా పటాన్‌చెరు, నానక్‌రామ్‌గూడ, తెల్లాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కొల్లూర్, రాయదుర్గం, బాచుపల్లి, కూకట్‌పల్లి, పుప్పాల్‌గూడ, కొంపల్లి, మేడ్చల్, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ భారీగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో నివాస భూముల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక మంగల్‌పల్లి, బాటసింగారం ప్రాంతాలతోపాటు శంషాబాద్, పెద్ద అంబర్‌పేట్, మనోహరాబాద్, మియాపూర్‌లో ప్రభుత్వం లాజిస్టిక్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. 

- గ్రేటర్‌ మధ్యభాగం: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. సంపన్నుల నివాసాలకు చిరునామాగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు చదరపు గజం భూమి సైతం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పైగానే పలుకుతోంది. ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ నిర్మాణరంగ కంపెనీలు విలాసవంతమైన ఫ్లాట్లు, భవనాలు, ఆఫీస్‌ స్పేస్‌ ఉండే వాణిజ్య భవంతులు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు భారీగా నిర్మిస్తుండటంతో భూమి బంగారాన్ని తలపిస్తోంది. 

ఏ దిక్కు చూసినా కోట్లే.. 
కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ తమ అధ్యయనంలో గ్రేటర్‌ సిటీని నాలుగు భాగాలుగా విభజించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలను సుమారుగా లెక్కగట్టింది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు బంగారం కావడానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే..  

- గ్రేటర్‌ పడమర ప్రాంతం: రాయదుర్గం, పుప్పాల్‌గూడ, కొల్లూర్, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, తెల్లాపూర్, గోపన్‌పల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాలున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఐటీ, బీపీఓ, కెపిఓ, బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాలు వేలాదిగా వెలిశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిసరాలకు క్యూ కడుతుండడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా ఔటర్‌కు సమీపంలో ఉండటంతో ప్రధాన నగరంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ బాగా పెరిగింది. మరోవైపు వ్యాపార, వాణిజ్య అవకాశాలు విస్తృతమయ్యాయి. సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలు హబ్‌గా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తున్న వారితోపాటు విదేశీయులు సైతం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఆఫీస్‌ స్పేస్, నివాస సముదాయాలకు గిరాకీ బాగా పెరగి బహుళ అంతస్తుల భవంతులు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు భారీగా వెలుస్తున్నాయి. 

గ్రేటర్‌ తూర్పు ప్రాంతం: ఉప్పల్, పోచారం ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉప్పల్‌లో మెట్రో డిపో ఏర్పాటు, కనెక్టివిటీ పెరగడం, హెచ్‌ఎండీఏ మెట్రో సిటీ లే అవుట్, శిల్పారామం ఏర్పాటు కావడంతోపాటు వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని ఈ ప్రాంతం అక్కున చేర్చుకుంటోంది. ప్రస్తుతం కోర్‌ సిటీకి దీటుగా పురోగమిస్తోంది. ఇక పోచారంలో ఇన్ఫోసిస్‌ సంస్థతోపాటు ఇతర ఐటీ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా వెలుస్తుండడంతో టెకీలు ఈ ప్రాంతంలో ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 
గ్రేటర్‌ ఉత్తర ప్రాంతం: మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు ద్రాక్ష తోటలతో కనిపించిన ఈ ప్రాంతాలు ఇప్పడు ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నివాస సముదాయాలు, ఫ్లాట్లు, ప్లాట్లతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వాణిజ్య స్థలాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు