ప్రైవేటు బస్సు.. చట్టాలన్నీ తుస్సు

22 Jun, 2017 01:46 IST|Sakshi
ప్రైవేటు బస్సు.. చట్టాలన్నీ తుస్సు

రిజిస్ట్రేషన్, పర్మిట్లు ఓ రాష్ట్రంలో.. సర్వీసులు మరో రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్ర నిబంధనల ఉల్లంఘన.. అరుణాచల్‌ ఉదంతంతో మళ్లీ తెరపైకి..

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ప్రైవేటు బస్సుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అటు ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతూ.. ఇటు ప్రయాణికులపైనా చార్జీల మోత మోగిస్తూ.. దండుకుంటున్నాయి. బస్సుల స్వరూపం నుంచి పర్మిట్ల వరకూ అన్నీ అక్రమాలు, అవకతవకలే. ఏదో ఓ రాష్ట్రంలో రిజిస్టరై, పర్మిట్లు పొందడం.. ఇక్కడ స్టేజీ క్యారియర్లుగా తిరగడం సాధారణమైపోయింది. ఇలా అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై, పర్మిట్లు పొంది తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులపై అరుణాచల్‌ అధికారులు కొరడా ఝలిపించడంతో ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్‌ను నియంత్రించాలని, అలాగైతేనే ఆర్టీసీ బాగుపడుతుందనే డిమాండ్లు వస్తున్నాయి. క్షుణ్నంగా గమనిస్తే ఈ వ్యవహారంలో ఎన్నో ఉల్లంఘనలు, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తాయి.

బెర్తులుగా మారిపోతున్న సీట్లు!
కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 నిబంధన 128 (10) ప్రకారం.. జాతీయ పర్మిట్‌ ఉన్న రవాణా వాహనాల్లో కేవలం కూర్చోవటానికి సీట్లు మాత్రమే ఉండాలి. బెర్తులు ఏర్పాటు చేసి స్లీపర్‌ బస్సులుగా తిప్పొద్దు. కానీ పర్మిట్లతో సంబంధం లేకుండా యథేచ్ఛగా బెర్తులు ఏర్పాటు చేసి స్లీపర్‌ బస్సులుగా తిప్పుతున్నారు. పుదుచ్చేరితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, అక్కడి నుంచి పర్మిట్లు పొందుతున్నారు.

పరిధి దాటుతున్నాయ్‌..
కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 125 సి (4) ప్రకారం.. ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు మాత్రమే వాటి పర్మిట్‌ పరిధిలో బెర్తులుండే బస్సులను తిప్పవచ్చు.

కానీ తెలంగాణ పర్మిట్, ఏపీ పర్మిట్‌ ఉన్న బస్సులు యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు స్లీపర్‌ బస్సులు నడుపుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ప్రాంతాలకు, బెంగళూరు, చెన్నై, ముంబైలకు తిప్పుతున్నాయి.

రిజిస్ట్రేషన్, పర్మిట్‌ ఒక చోట.. తిరిగేది మరోచోట
కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 85 (3) ప్రకా రం.. ఒక రాష్ట్రం నుంచి పర్మిట్‌ పొందిన బస్సు తన ట్రిప్పు ను ఆ రాష్ట్రం నుంచే ప్రారంభించి.. తిరిగి ఆ రాష్ట్రంలోనే ము గించాలి. ఉదాహరణకు తెలంగాణలో పర్మిట్‌ పొందిన బస్సు బెంగళూరుకు కాంట్రాక్టు క్యారేజీగా వెళితే.. బుక్‌ చేసుకున్నవారిని తెలంగాణలో ఎక్కించుకుని బెంగళూరు తీసుకెళ్లి దింపేయాలి, లేదా మళ్లీ వారితోనే తిరిగి రావాలి. ఇతర ప్రయాణికులను ఎక్కించుకురావటం చట్టవిరుద్ధం.

కానీ అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఇతర ప్రాంతాల్లో బస్సులను రిజిస్టర్‌ చేసి, పర్మిట్‌ పొంది.. ఆ రాష్ట్రంతో సంబంధం లేకుండా వేరే ప్రాంతాల్లో తిప్పుతున్నారు. అలాంటి దాదాపు వెయ్యి బస్సులు తెలుగు రాష్ట్రాలు కేంద్రాలుగా హైదరాబాద్‌ నుంచి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ముంబైలకు తిరుగుతున్నాయి.

బోర్డు పెట్టి.. టికెట్లు అమ్మి మరీ..
ఏపీ, తెలంగాణ మోటారు వాహనాల చట్టం నిబంధన 297(ఎ) ప్రకారం... ఆర్టీసీ మినహా మరే సంస్థలు కూడా రవాణా బస్సులను స్టేజీ క్యారియర్లుగా తిప్పడానికి వీలు లేదు. వాటికి కేవలం టూరిస్టు పర్మిట్‌ మాత్రమే ఇస్తారు.

చాలా సంస్థలు టూరిస్ట్‌ పర్మిట్‌ పొంది స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నాయి. దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసి మరీ ప్రయాణికులకు టికెట్లు అమ్ముతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ టికెట్ల దందా నిర్వహిస్తున్నాయి.

తెల్లరంగు... నీలం చారలు..
మోటారు వాహనాల చట్టం నిబంధన 128 ప్రకారం.. ప్రైవేటు బస్సులు తెలుపు రంగులో ఉండాలి. కేవలం నీలం రంగు చార ఉండాలి. కానీ ప్రస్తుతం ఏ సంస్థ బస్సు చూసినా రంగులు, డిజైన్లతో ఉంటాయి. వాస్తవానికి నిర్ధారిత రంగు ఉంటేనే అధికారులు పర్మిట్‌ ఇవ్వాలి. కానీ మామూళ్లు తీసుకుని అనుమతులిచ్చేస్తున్నారు.

ఆర్టీసీకి ఆ సామర్థ్యం ఉందా..?
ఉన్నట్లుండి ప్రైవేటు బస్సులను నిలిపివేస్తే ఆ మేర ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఆర్టీసీకి లేదు. కొత్తగా కనీసం వెయ్యికిపైగా బస్సులు సమకూర్చుకోవాల్సిందే. కానీ సిబ్బంది జీతాలకే కిందా మీదా పడుతున్న ఆర్టీసీకి కొత్త బస్సులు కొనే శక్తి లేదు. ప్రభుత్వం నిధులిస్తేనే సాధ్యం.

పొడవు, ఎత్తు పెరిగితే ప్రమాదమే
ప్రయాణికుల రవాణా బస్సులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాటి పొడవు, ఎత్తుకు సంబంధించి కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 93 కింద పరిమితులను విధించారు. కానీ ప్రైవేటు సంస్థలు అత్యాశతో బస్సు పొడవు, ఎత్తును అక్రమంగా పెంచుతూ.. అదనంగా సీట్లు ఏర్పాటు చేయించుకుంటున్నాయి.

స్లీపర్‌ బస్సులో ఉండాల్సిన బెర్తులు 24

36 ప్రైవేటు బస్సుల్లో ఉంటున్న బెర్తులు


 

మరిన్ని వార్తలు