ప్రైవేటు దోపిడీని అరికట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ

6 Jul, 2018 09:13 IST|Sakshi
 కళాశాలలో తరగతులను బహిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు 

వికారాబాద్‌ అర్బన్‌: ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో గురువారం విద్యాసంస్థల బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. సామాన్యులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు.

కార్పొరేట్‌ పేరుతో పాఠశాలలు, కళాశాలలు లక్షల ఫీజులు వసూలూ చేస్తున్నట్లు తెలిపారు. కేజీ టూ ఫీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానన్న కేసీఆర్‌ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

ఎయిడెడ్‌ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. రూ.వేల కోట్ల రూపాయల ఆస్తులను దక్కించుకునేందుకు ప్రభుత్వం ఈ రకమైన కుట్రను చేస్తుందన్నారు. వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభ వంటి ఎయిడెడ్‌ కళాశాల అందరి సహకారంలో ఏర్పడిందన్నారు. ఈ ప్రాంత రైతులు ధాన్యం అమ్మినప్పుడు కొంత డబ్బు కళాశాల కోసం వెచ్చించారని, ఇప్పుడు ప్రైవేటు చేస్తే ఆ ఆస్తి పూర్తిగా అక్రమార్కుల చేతులోకి పోతుందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. యూజీసీని రద్దు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. యూజీసీ రద్దు చేస్తే దాదాపుగా ప్రభుత్వ పరమైన విద్య ఆగిపోయినట్లే అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ ఆందోళన చేస్తుందన్నారు. బంద్‌ నిర్వహిస్తున్న  నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీపై వదిలిపెట్టారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు