కమలానికి ‘కొత్త’జోష్‌..! 

19 Aug, 2019 10:30 IST|Sakshi
కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి పార్టీ కండువా కప్పి కరచాలనం చేస్తున్న బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా

సాక్షి, కొత్తగూడెంఅర్బన్‌ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లాలోనూ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు కేడర్‌ను పెంచుకుంటూనే మరోవైపు జిల్లాలోని ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి చేర్చుకుంటోంది. దీంతో పార్టీ బలం మరింతగా పెరిగే అవకాశం ఉంది. సీనియర్‌ నాయకులతోపాటు ఇతర కేడర్‌ సైతం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని), ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య ఆదివారం హైదరాబాద్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.పి.నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నడ్డాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరిరువురి చేరికతో జిల్లాలో బీజేపీకి కొంత బలం పెరిగిందని చెప్పవచ్చు. రానున్న మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి జిల్లాలోనూ కేడర్‌ను పెంచుకోవడంతోపాటు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ తామే గట్టి పోటీ అని చెప్పేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. కిందిస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు మరిన్ని చేరికలను కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది. జిల్లాలో ఎలాగైనా బలమైన పార్టీగా ఎదిగేందుకు రాష్ట్ర పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. ఊకె అబ్బయ్య, కోనేరు సత్యనారాయణ ఆ పార్టీలో చేరడంతో జిల్లా పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాగా ఈ ఇద్దరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కొనసాగిన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న, కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపారు. వీరితోపాటు పలు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

జిల్లాలో టీడీపీ ఖాళీ..! 
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి కోనేరు కుటుంబం ఆ పార్టీని అంటిపెట్టుకునే ఉంది. ప్రస్తుతం కోనేరు సత్యనారాయణ(చిన్ని) భారతీయ జనతా పార్టీలో చేరడంతో భద్రాద్రి జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయినట్టేనని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి ఆ పార్టీకి ప్రతినిద్యం వహించే నాయకుడు లేరని చెపుతున్నారు.  టీడీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు, ద్వితీయ స్థాయి క్యాడర్, పట్టణ, మండల స్థాయి నాయకులు కూడా బీజేపీ తీర్థం  పుచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు