హోరెత్తిన ధర్నాలు

27 Oct, 2019 01:34 IST|Sakshi
ప్రభుత్వ తీరుకు నిరసనగా గులాబీ రంగులో ఉన్న జెండాను తెలుపు రంగులోకి మార్చుకున్న టీఎంయూ

కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్న కార్మికులు

సీఎం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు. కుటుంబ సభ్యులతో కలసి డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. చర్చ లు జరుగుతాయన్న సమాచారం ఉన్నా సమ్మె మాత్రం ఉధృతంగా కొనసాగింది. ఈనెల 30న సరూర్‌నగర్‌లో సకల జనుల సమరభేరి పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని నిర్ణయించినందున అందుకు జనసమీకరణ కసరత్తు కూడా ప్రారంభించారు. సమ్మెలో ఉన్న కార్మికులు కుటుంబసభ్యులతో కలసి ఆ సభకు హాజరు కావాలంటూ ఎవరికివారు ప్రచారం చేస్తున్నారు. స్థానిక విపక్ష నేతలను కలిసి ఆయా పార్టీల కార్యకర్తలు, సాధారణ జనం కూడా సభకు తరలాలని కోరుతున్నారు. ఆదివారం దీపావళి పండుగ కావ టంతో సొంతూళ్లకు వెళ్లేవారితో శనివారం బస్టాండ్లు కిటకిటలాడాయి. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పినా అవి సరి పోక జనం ఇబ్బంది పడాల్సి వచ్చింది.

పండుగకు బస్సు కష్టాలు.. 
దసరా వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడ్డ అనుభవంతో కొందరు ప్రయాణాలు మానుకోవటం విశేషం. పండగ రద్దీ నేపథ్యంలో గత 20 రోజుల్లో తొలిసారి శనివారం 75% బస్సులు తిప్పినట్టు అధికారులంటున్నారు. మొత్తం బస్సులు తిప్పినా పండుగ రద్దీ తాకిడికి సరిపోని పరిస్థితి. అలాంటిది ఉన్న బస్సు ల్లో 75% తిప్పటంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.  ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. అధిక చార్జీలు వసూలు చేయటంతో వారి జేబులకు చిల్లు్ల పడింది. దసరా సమయంలో ప్రైవేటు బస్సులు వచ్చినట్టుగానే శనివారం కూడా చాలా బస్టాండ్లలో వీటి హవా కనిపించింది. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు కొందరు హోటళ్లలో పని చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. హుస్నాబాద్, జహీరాబాద్‌ డిపోల ముందు  ధర్నాలు చేశారు. మెదక్‌ డిపో ఎదుట మహిళా కండక్టర్లు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

అరగుండు..అరమీసం.. 
ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల ఎదుట కార్మికులు పిల్లలతో కలిసి ధర్నాలు చేపట్టారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ వారు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం బస్‌ డిపో వద్ద కార్మికుల నిరసనకు సంఘీభావంగా అఖిలపక్ష నేతలు చెవిలో పూలతో పాల్గొన్నారు. కార్మి కులకు మద్దతుగా వామపక్ష విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెట్‌పల్లి డిపో వద్ద సమ్మయ్య, జేఆర్‌రావు అనే డ్రైవర్లు అరగుండు, అరమీసంతో నిరసన చేపట్టారు.

గోదావరి ఖని డిపో వద్ద నిరసనలు చేపట్టారు.మంథనిలో కార్మికుల కుటుం బీకుల నిరసనలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.శనివారం 4782 ఆర్టీసీ బస్సులు, 1944 అద్దె బస్సులు మొత్తం 6,726 బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు. 4,782 ప్రైవేటు డ్రైవర్లు, 6,726 మంది కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు వెల్లడించారు. 4,961 బస్సుల్లో టికెట్‌ జారీ యంత్రాలు, 939 బస్సుల్లో సాధార ణంగా టికెట్ల జారీ జరిగిందన్నారు.

బస్సుల కోసం 22 వేల దరఖాస్తులు
తాజాగా అద్దె బస్సుల కోసం పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,248 బస్సుల కోసం  టెండర్లు పిలిచారు. టెండరు పత్రాల దాఖలు శనివారం సాయంత్రం వరకు సాగింది.  22,300 దరఖాస్తులు రావటం విశేషం. హైదరాబాద్‌లో 248 బస్సులకు టెండర్లు పిలవగా 332 దరఖాస్తులు అందాయి. జిల్లాల్లో వేయి బస్సులకు గాను 22 వేల దరఖాస్తులు వచ్చాయి. వారం క్రితం వేయి బస్సులకు టెండర్లు పిలవగా జిల్లాల్లో 9,700 దరఖాస్తులు రాగా హైదరాబాద్‌లో మాత్రం 18 వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో బస్సులు సిద్ధంగా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తూ అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 48 గంటల్లోనే బస్సు  నడుపుకొనేందుకు అనుమతిస్తారు. కానీ రెడీగా బస్సులు ఉన్న టెండర్లు  90 మాత్రమే అందినట్టు తెలిసింది. బస్సులు లేని వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు 90 రోజుల్లో బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు