గాంధీలో మరో శవ పంచాయితీ 

21 Jun, 2020 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వరుస శవ పంచాయితీలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువైంది. అదృశ్యమైన రోగి గాంధీ మార్చురీలో శవమై కనిపించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. మృతి చెందినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించి అనాథశవంగా పడేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సదరు మృతుడు కోవిడ్‌ బాధితుడే కాదని ఆస్పత్రి వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మృతుడి బంధువులు, ఆస్పత్రివర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..

మంగళ్‌హట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దూల్‌పేట జిన్సీచౌరాహీకి  చెందిన నరేందర్‌సింగ్‌ (35) తీవ్ర అస్వస్థతకు గురై గతనెల 30న కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అదే రోజు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్‌ అయిన మరుసటి రోజు నరేందర్‌సింగ్‌ తన సోదరుడు ముకేష్‌సింగ్‌కు ఫోన్‌ చేసి గాంధీ ఆస్పత్రిలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. మరుసటి రోజు నుంచి నరేందర్‌సింగ్‌ సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. గాంధీ ఆస్పత్రితో పాటు కింగ్‌కోఠి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. నరేందర్‌సింగ్‌ కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

ఈ క్రమంలో సోదరుడు ముకేష్‌సింగ్‌ ఈనెల 6న మంగళ్‌హట్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో నరేందర్‌సింగ్‌ మిస్సింగ్‌ వివరాలను పొందుపరుస్తు సోదరుడు ముకేష్‌సింగ్‌ తాజాగా వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. సోదరుడి జాడ తెలియజేయకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశాడు. సదరు వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టి శనివారం గాంధీ కరోనా మార్చురీతో పాటు సాధారణ మార్చురీల్లో వెతికారు. సాధారణ మార్చురీలో ఉన్న నరేందర్‌సింగ్‌ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహం నరేందర్‌సింగ్‌దిగా గుర్తించారు. గాంధీ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే నరేందర్‌సింగ్‌ మృతి చెందాడని ఆరోపిస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

పోలీసులే మార్చురీలో ఉంచారు: సూపరింటెండెంట్‌ 
కాగా ఈ విషయంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు మాట్లాడుతూ.. నరేందర్‌సింగ్‌ కరోనా బాధితుడే కాదని స్పష్టం చేశారు. మృతుడు గతనెల 30న గాంధీ ఓపీ విభాగానికి వచ్చి వెల్లినట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కరోనా జాబితాలో అతని పేరే లేదన్నారు. మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ)గా నమోదు చేశామని, పోలీసులే గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో పెట్టారని వివరించారు. గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం, సిబ్బంది నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. మృతుడు నరేందర్‌సింగ్‌ కరోనా బాధితుడా? కాదా.? గాంధీ మార్చురీలోకి అతని మృతదేహం ఎలా వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం గమనార్హం.     

మరిన్ని వార్తలు