శతాబ్ది.. సూపర్‌ క్లీన్‌!

24 Jan, 2019 01:38 IST|Sakshi

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా 

పుణె– సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 

ఐఆర్‌సీటీసీ టోటల్‌ క్లీన్‌లైన్స్‌ సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా సికింద్రాబాద్‌ – పుణె మధ్య నడుస్తోన్న పుణె– సికింద్రాబాద్‌ శతాబ్ది రైలు నిలచింది. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ఈ రైలు సెంట్రల్‌ రైల్వే జోన్‌ నుంచి దక్షిణ మధ్య రైల్వే కేంద్రాల మధ్య నడుస్తుంది.ఈ రైలు బయల్దేరేటపుడు తీసుకుంటున్న పరిశుభ్రతా చర్యలే దీనికి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ఘనత సాధించడం వెనుక దక్షిణమధ్య రైల్వే పాత్ర కూడా ఉంది. రైలు పుణె నుంచి బయల్దేరినా.. సికింద్రాబాద్‌ చేరాక.. ఇక్కడ కూడా రెండో నిర్వహణలో భాగంగా గంటపాటు రైలును మరోసారి శుభ్రపరిచి ప్రయాణానికి సిద్ధం చేస్తారు. దేశంలో నడుస్తోన్న మొత్తం 26 ప్రీమియం రైళ్లలో ఈ రైలు పరిశుభ్రతకే అధికశాతంమంది ప్రయాణికులు ఓటేయడం విశేషం. మొత్తం 1000 పాయింట్లకు గాను ఈ రైలు 916 పాయింట్లు సాధించింది 

దక్షిణ మధ్య రైల్వేకు ఆఖరి స్థానం.. 
స్వచ్ఛ్‌రైల్‌ స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌లో భాగంగా పురోగతి తెలుసుకునేందుకు, పరిశుభ్రత విషయంలో రైళ్ల మధ్య పోటీ పెంచేందుకు ఐఆర్‌సీటీసీ టోటల్‌ క్లీన్‌లైన్స్‌ పేరిట ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 209 రైళ్లలో ప్రయాణికుల వద్ద అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో జైపూర్‌ కేంద్రంగా నడిచే వాయవ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1000 పాయింట్లకు 860 పాయింట్లు సాధించింది. ఈ సర్వేలో దక్షిణమధ్య రైల్వేకు 658 పాయింట్లతో ఆఖరు స్థానం దక్కింది. 

మరిన్ని వార్తలు