జీఎస్టీపై అప్పీళ్లకు ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌

24 Jan, 2019 01:39 IST|Sakshi

సార్క్‌ దేశాలతో కరెన్సీ స్వాప్‌ 

ఆహార రంగంలో జపాన్‌తో సహకారం

కేంద్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు  

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏదైనా అంశంలో వివాదం ఏర్పడితే రెండో అప్పీలు చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నది కేంద్రం ఉద్దేశం. రాష్ట్రాల స్థాయిలో భిన్న తీర్పులు వచ్చిన కేసులను సైతం జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌ విచారిస్తుంది. ఢిల్లీలో ఏర్పాటయ్యే ఈ బెంచ్‌లో కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడు ఉంటారు.

ఓ ప్రెసిడెంట్‌ కూడా ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటనలో తెలియజేశారు. జీఎస్టీ విషయంలో రెండో అప్పీల్‌కు, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే పరిష్కారానికి తొలి వేదికగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీని ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ డిసెంబర్‌లోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ అందుకు మార్గం సుగమం చేసింది. దీనితోపాటు పలు ఇతర నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్‌ తీసుకుంది.  

జపాన్‌తో భాగస్వామ్యం 
ఆహార ప్రాసెసింగ్‌లో జపాన్‌తో సహకారానికి అనుకూలంగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆహార శుద్ధి రంగంలో ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని ప్రభుత్వం పేర్కొంది. ఇరుదేశాలకూ మార్కెట్‌ అనుసంధానత పెరగడంతోపాటు ఈ రంగంలో ఉత్తమ విధానాలను ప్రోత్సహించేందుకు వీలుపడుతుందని వివరించింది. దేశంలో ఆహార ప్రాసెసింగ్‌ పెరిగేందుకు ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
 
400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ 
‘సార్క్‌’ దేశాలతో 400 మిలియన్‌ డాలర్ల మేర స్థిర సదుపాయంతో కరెన్సీ మార్పిడికి సంబంధించిన సవరణలకు కేంద్ర కేబినెట్‌ అంగీకారం తెలిపింది. సార్క్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద ప్రస్తుత పరిమితి మించిన సందర్భాల్లో, సభ్య దేశాల నుంచి అభ్యర్థన వచ్చినప్పుడు భారత్‌ సత్వరమే స్పందించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. 

మరిన్ని వార్తలు