24 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు

15 Jul, 2020 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ దివంగత ప్రధాన మంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సహింరావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని  నిర్ణయించినట్లు బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై టీపీసీసీ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ గీతారెడ్డి, వైస్‌ చైర్మన్ శ్రీధర్‌ బాబు, కన్వీనర్‌ మహేష్‌ గౌడ్‌లతో చర్చించినట్లు తెలిపారు. అంతేగాక పీవీ ఉత్సవ కమిటీ సభ్యులు వేణుగోపాల్‌తో కలిసి పీవీ కుటుంబ సభ్యులలైన పీవీ ప్రభాకర్‌ రావు, పీవీ మనోహర్‌ రావ్‌, వాణి దేవిలతో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీలో చీఫ్ పట్రాన్‌గా ఉండడానికి పీవీ మనోహర్ రావ్ అంగీకరించారని, 24న జరగబోయే ఆన్‌లైన్‌ సమావేశంలో మనోహర్రావ్ పాల్గొంటారని స్పష్టం చేశారు. అదే విధంగా పీవీ ప్రభాకర్ రావ్, వాణిదేవిలు వారి సందేశాలను కూడా పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: మరో సీనియర్‌ నేతను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌)

జూలై 24వ తేదీన ఉత్సవాలు ప్రారంభించి వరసగా ఏడాది పాటు వివిధ రకాల కార్యక్రమాలు కొనసాగిస్తామని ఉత్తమ్‌ వెల్లడించారు. పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, ఆయన రాజకీయ కార్యక్రమాలు, ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలు అన్ని అంశాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళతామని  వివరించారు. ఆన్‌లైన్‌లో జరగబోయే ఈ కార్యక్రమంలో పీవీ అత్యంత సన్నిహితులైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత జరగబోయే కార్యక్రమాలలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, శశిథరూర్‌లు కూడా పాల్గొంటారని చెప్పారు. పీపీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులుగా మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావును నియమించినట్టు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు