‘ఇది చాలా భయకంరంగా ఉంది’

15 Jul, 2020 20:57 IST|Sakshi

క్వారంటైన్‌లో బ్రెజిల్‌ అధ్యక్షుడికి చేదు అనుభవం!

బ్రెజీలియా: మహమ్మారి కరోనా బారిన పడి తన అధికారిక భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారోకు చేదు అనుభవం ఎదురైంది. క్వారంటైన్‌లో భారంగా రోజులు గడుపుతున్నానన్న ఆయన.. సరదాగా రియా పక్షులకు ఆహారం తినిపించడానికి వెళ్లి చేతికి గాయం చేసుకున్నారు. పక్షి ముక్కుతో పొడవడంతో కాసేపు బాధతో విలవిల్లాడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మురేల్‌ అనే నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బోల్సోనారో జూలై 7న ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం బ్రెసీలియాలోని అధ్యక్ష భవనంలో నిర్బంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం ఆయన ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇలా ఇంటికే పరిమితం కాలేను. ఇది చాలా భయంకరంగా ఉంది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులేమీ లేవు. రుచి కూడా బాగానే తెలుస్తోంది’’ అని వెల్లడించారు. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా )

కాగా ఇంట్లో బోర్‌ కొట్టడం మూలాన రియా పక్షులకు ఆహారం తినాలని అధ్యక్షుడు భావించారని.. ఇంతలో ఓ పక్షి తన ముక్కుతో ఆయన చేతిని పొడిచిందని సదరు మీడియా పేర్కొంది. కాగా దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపించే రియా పక్షులు ఈము, నిప్పుకోడిలాగా బాగా ఎత్తుగా ఉంటాయి. ఇవి ఎగరలేవు. కాగా బ్రెజిల్‌లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఆది నుంచి వైరస్‌ తీవ్రతను తక్కువగా అంచనా వేసిన బోల్సోనారో ప్రస్తుతం తానే మహమ్మారితో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటికే అక్కడ దాదాపు 74 వేల మంది మృత్యువాత పడగా.. 19 లక్షల మందికి పైగా కరోనా సోకింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా