ప్రశ్నాపత్రాలు లీక్

15 Mar, 2016 20:13 IST|Sakshi

2015-16 విద్యాసంవత్సరం 6 నుంచి 9 తరగతులకు నిర్వహించే వార్షిక పరీక్ష ప్రశ్న పత్రాలు మంచిర్యాలలో ఒక రోజు ముందుగానే లీక్ అవుతున్న విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. జిల్లా డీసీఈబీ ఈ నెల 9 నుంచి 16 వరకు వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ప్రశ్న పత్రాలను సంబంధిత ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రై వేటు పాఠశాలలకు మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంగా ముందస్తుగా డీసీఈబీ పంపిణీ చేసింది.


 ఉదయం 6, 7, 9 తరగతులకు, సాయంత్రం 8, 9 తరగతులకు పరీక్ష నిర్వహించాలి. 9 తరగతికి ప్రథమ, ద్వితీయ ప్రశ్న పత్రాలను కేటాయించారు. ప్రశ్నపత్రాలు ముందుగా రావడంతో స్థానిక ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే పరీక్షలు నిర్వహించడంతో మిగతా పాఠశాలల విద్యార్థులు ఆ పాఠశాల విద్యార్థుల ఇళ్ల చుట్టూ ప్రశ్న పత్రాల కోసం తిరగడంతో విషయం బయటకు పొక్కింది.


పరీక్ష ముగిసే సమయానికి ఆ పాఠశాల సమీపంలో ఇతర పాఠశాలల విద్యార్థులు చేరుకుని ప్రశ్న పత్రం కోసం ప్రాధేయపడుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలకు ముందుగా ప్రశ్నపత్రాలను అందజేయడంతో వారిలో పలు యాజమాన్యాలు ముందస్తుగా పరీక్ష నిర్వహించడంతో ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  ఎంఈఓ అదీనంలోనే ఉండి ఏ రోజు ప్రశ్న పత్రాలు అదే రోజు పంపిణీ చేసిన నేపథ్యంలో లీకేజీ ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయమై మంచిర్యాల ఎంఈఓ పారువెల్లి ప్రభాకర్‌రావును సంప్రదించగా.. ప్రశ్నపత్రాలు ముందుగానే లీక్ అవుతున్న విషయం తెలిసి అనుమానం ఉన్న ప్రై వేటు పాఠశాలలను తనిఖీ చేశామని అన్నారు. ఎక్కడ కూడా లీక్ అవుతున్నట్టుగా తనిఖీలో వెల్లడి కాలేదని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల ప్యాకేజీలకు సీల్ ఉందని, మరోసారి తనిఖీ చేయనున్నానని, తనిఖీలో దొరికిన పాఠశాల యాజమాన్యంపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు