అధినేతపైనే  ఆశలు

5 Aug, 2018 13:05 IST|Sakshi
రాహుల్‌గాంధీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాహుల్‌గాంధీ పర్యటనపై కాంగ్రెస్‌ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. నిద్రాణస్థితిలో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి అధినేత పర్యటన టానిక్‌లా పనిచేస్తుందని అంచనా వేస్తోంది. ఈనెల 13, 14వ తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పర్యటనను ఖరారు చేసిన టీపీసీసీ.. జిల్లాలో ఆయన టూర్‌ మ్యాప్‌ను రూపొందిస్తోంది. రాహుల్‌ యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం సర్వశక్తులొడ్డుతోంది. సాధారణ ఎన్నికలకు శంఖారావంగా భావించే ఈ పర్యటనను సక్సెస్‌ చేయడానికి రెండు రోజులుగా ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి మాత్రం భారీ అంచనాలు పెట్టుకుంది.

2014లో పరిగి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లను మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది. ఇందులో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకోగా.. ఆ తర్వాత జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతైంది. ఈ పరిణామాలతో  ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సంస్థాగతంగా పార్టీకి గట్టి పట్టున్నా చేదు ఫలితాలతో డీలా పడింది. మరోవైపు సీనియర్ల మధ్య నెలకొన్న విభేదాలు కూడా పార్టీపై ప్రభావం చూపాయి. ఈ అసమ్మతి రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ గతంతో పోలిస్తే కొంత మేర తగ్గుముఖం పట్టాయి. ఇలా నాలుగేళ్లు నెట్టుకొచ్చిన పార్టీ..  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పూర్వవైభవం సాధించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
 
శివార్లపై నజర్‌ 
కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ అధినాయకత్వం రాష్ట్రంలో పాగావేయడానికి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతినెలా అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించేలా చొరవ చూపుతోంది. ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో పార్టీ బలీయంగా ఉండడంతో రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించింది. టీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా బలం లేకపోవడంతో ఈ జిల్లాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా నగర శివార్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కన్నేసింది. సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో గట్టిగా కష్టపడితే ఆ సీట్లను గెలుచుకోవడం సులువని అభిప్రాయపడుతోంది.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో రాజేంద్రనగర్‌ మినహా మిగతావి కాంగ్రెస్‌ ఖాతాలో ఉండేవి. ఈ తరుణంలో మరోసారి ఇక్కడ పాగా వేసేందుకు రాహుల్‌ పర్యటనను వినియోగించుకోవాలని భావిస్తోంది. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించే రాహుల్‌.. అధిక శాతం శివారు ప్రాంతాల్లో రోడ్‌ షో, బస్సు యాత్రలు చేసేలా టీపీసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది. అంతేగాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా రాహుల్‌ పర్యటించేలా చూస్తోంది. ఇప్పటికే అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్న పీసీసీ రాహుల్‌ రాకతో అసమ్మతి రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేత పర్యటన పార్టీ కేడర్‌లో కొత్త జోష్‌ నింపుతుందనే భరోసాలో ఉంది. ఈ క్రమంలోనే రాహుల్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు