హైదరాబాద్‌లో మళ్లీ భారీవర్షం

8 Oct, 2017 13:33 IST|Sakshi

6.8 సెం.మీ. వర్షపాతం

నేడూ భారీ వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరం ఆదివారం మళ్లీ నిండామునిగింది. రాత్రి 7 గంటల వరకు 6.8 సెం.మీ. మేర భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై నడుములోతున వరదనీరు పోటెత్తింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు న  రకం చూశారు. మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్నాయి. దీంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల  ఉరుములు, మెరుపులతో పాటు తీవ్ర ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అదేవిధంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సంచాలకులు వైకే రెడ్డి  పేర్కొన్నారు.

ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లోకి నీరు చేరుతుండగా... వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. మరో నాలుగైదు రోజులు గడిస్తేగాని పంట నష్టం అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. ఆదివారం కూడా పలుచోట్ల భారీ వర్షాలే నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 6.8 సెం.మీ., ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1.3 సెం.మీ. వర్షం కురిసింది. మిగతా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా గోల్కొండ మండలంలో 11.8 సెం.మీ,, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌లో 8.4 సెం.మీ., రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 7.6 సెం.మీ., నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో 6 సెం.మీ., వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలో 5.6 సెం.మీ. వర్షం కురిసింది. వర్షాల కారణంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 33 డిగ్రీలు, భ ద్రాచలంలో 32, హకీంపేటలో 31 డిగ్రీ సెల్సీయస్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

రాజధాని అతలాకుతలం
రాజధాని నగరం ఆదివారం మళ్లీ నిండామునిగింది. రాత్రి 7 గంటల వరకు 6.8 సెం.మీ. మేర భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై నడుములోతున వరదనీరు పోటెత్తింది. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై పార్క్‌ చేసిన  కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. కొత్తపేట్, మలక్‌పేట్, మొజంజాహీ మార్కెట్, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు సైతం వరదనీటిలో భారంగా ముందుకు కదిలాయి. గ్రేటర్‌ పరిధిలోని 1,500 కి.మీ. మేర విస్తరించిన నాలాల  కారణంగా మూసీలో వరదనీరు పోటెత్తింది. సుమారు 50 బస్తీల్లో వరదనీరు భారీగా చేరింది. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, స్థానికులు వరద నీటిని తోడేందుకు నానా అవస్థలుపడ్డారు. సుమారు వంద సిగ్నల్స్‌ వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌ స్తం భించింది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకొని ప్రయాణికులు, వాహనదారులు విలవిల్లాడారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగం పేట్‌ వాతావరణ శాఖ తెలిపింది.

కూకట్‌పల్లిలో కుంగిన రోడ్డు
రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. కూకట్‌పల్లి ఎల్లమ్మబండ రోడ్డు మధ్యలో డ్రైనేజ్‌ పైప్‌ లైన్‌ పగిలి నీరు ప్రవహిస్తుండటంతో భారీ గోయ్యి ఏర్పడింది. దీంతో అధికారులు ట్రాఫిక్‌ మళ్లించి రోడ్డును పునరుద్ధరిస్తున్నారు. ఉషా ముళ్లపూడి రోడ్డులో గాజుల రామారం వెళ్లే దారిలో ఆదివారం ఉదయం పెద్ద గుంట పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించే మార్గం కావడంతో గుంత పడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కర్మన్‌ఘాట్ ప్రధాన రహదారిపైకి వచ్చి చేరిన వరద నీరు లాల్ దర్వాజా, ఉప్పుగూడ,బార్కస్ ప్రాంతాల్లో నాలలో నుంచి రోడ్డు పైకి వచ్చిన వరద నీరు

కర్మన్‌ఘాట్ దుర్గానగర్ కాలనీ లో వరదనీరు

భారీ వర్షానికి నీట మునిగిన నాగోల్ ,ఆదర్శ్ నగర్ రోడ్లు

మరిన్ని వార్తలు