ఆటోలపై పోలీస్‌ పంజా..

10 Jul, 2019 11:06 IST|Sakshi
మంచిర్యాల బస్టాండ్‌ వద్ద విచ్చలవిడిగా రోడ్డుపై నిలిపిన ఆటోలు

సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్‌) : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అక్రమ దందాలకు, అసాంఘిక కార్యకలపాలకు చరమగీతం పాడేందుకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ను నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు అక్రమార్కులపై రామగుండం కొత్వాల్‌ కొరడ ఝలిపిస్తున్నారు. ఇదే క్రమంలో కమిషనర్‌ సత్యనారాయణ ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆటోలపై ప్రత్యేక దృష్టి సారించారు.

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కొందరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. మరి కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి ప్రయాణికులను టార్గెట్‌ చేసి దాడికి పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. దీంతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రెండు జిల్లాల పోలీస్‌ అధికారులకు గురువారం కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఆటోల్లో అదనపు సీట్ల తొలగింపు
ఆటోడ్రైవర్‌ సీటు పక్కన అదనపు సీట్లు ఏర్పాటు చేసి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదనపు సీటు కలిగి ఉండి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుబడిన ఆటోలకు మొదటి సారి రూ. 1000 జరిమానా విధించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మరో సారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ. 2 వేలు జరిమానాతో పాటు ఆటో సీజ్‌ చేసి 10 రోజులు పోలీస్‌స్టేషన్లో ఉంచుతారు. మూడో సారి అలానే జరిగితే క్రిమినల్‌ కేసు నమోదు చేసి లైసెన్స్‌ రద్దు చేస్తారు. ఓనర్లు లైసెన్స్‌ లేని డ్రైవర్లకు ఆటోలు నడపడానికి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నుంచి లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేసిన వారిపై, ఆటో యజమానులపై కేసులు నమోదు చేయనున్నారు.

ఆరుగురిని మించి తరలించరాదు
పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలో ఆరుగురు కంటే ఎక్కువ విద్యార్థులను తరలించరాదు. కానీ చాలా ఆటోల్లో 10కి మించి స్కూల్‌ పిల్లలను తరలిస్తున్నారు. దీని వల్ల ప్ర మాదం జరిగే అవకాశాలు ఎ క్కువ. అంతే కాకుండా పొరపాటున ఏదైన ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం సంభవిస్తుంది. ఇక నుంచి ఆరుగురి కంటే ఎక్కువ స్కూల్‌ విద్యార్థులను ఆటోలో తరలిస్తే డ్రైవర్లతో పాటు పాఠశాల యాజమాన్యాలపై సైతం కేసులు నమోదు చేస్తారు. 

అసభ్యకరంగా ప్రవర్తించిన  వారిపై కఠిన చర్యలు
ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆటొలో ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్‌ చేసి మా యలో పడేసి దాడులకు పాల్పడుతున్నారు. ప్ర యాణికుల వద్ద అధిక కిరాయి వసూలు చేసిన వారిపై సైతం చర్యలు తీసుకోనున్నారు. పట్ట ణాల్లో బ్లూ కోట్‌ పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. కొందరు పోలీసులు ఎవరికి తెలియకుండా మఫ్టిలో ఉంటూ నిఘా పెట్టనున్నారు. రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలు నడిపినా, పార్కింగ్‌ చేసినా, మూల మలుపుల వద్ద ఆటోలు నిలిపినా కఠిన చర్యలు తప్పవు.

కాలం చెల్లిన ఆటోలపై నజర్‌
కమిషనరేట్‌ పరి«ధిలో కాలం చెల్లిన ఆటోలపై పోలీసులు దృష్టి సారించారు. ఫిట్‌నెస్‌ లేని ఆటోలను సీజ్‌ చేయడం జరుగుతోంది. కాలం ముగిసిన వాహనాలు నడుపడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది. కాలం చెల్లిన వాహనాలు రోడ్డుపై కనిపిస్తే డ్రైవర్లు, యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు.

మరిన్ని వార్తలు