8 నెలలు..7.5 కేజీల బరువు 

28 Apr, 2019 03:00 IST|Sakshi

రెయిన్‌బోలో శిశువుకు అరుదైన చికిత్స... 

ఒకేసారి రెండు వైపులా కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ చేసిన వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌: పుట్టుకతోనే మూగ, వినికిడిలోపంతో బాధపడుతున్న ఎనిమిది నెలలు..7.5 కేజీల బరువు ఉన్న శిశువుకు ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆ శిశువు వినికిడి లోపాన్ని జయించడమే కాకుండా స్వయంగా మాట్లాడుతోంది. చిన్నవయసులోనే ఒకే సమయంలో రెండు వైపులా చికిత్స చేయడం దేశంలోనే ఇదే తొలిదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జన్‌ డాక్టర్‌ సత్యకిరణ్‌ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన జశ్వంత్‌(8 నెలలు) మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇది చెవి, గొంతు పనితీరుపై ప్రభావం చూపింది.

మాట్లాడలేక పోవడమే కాకుండా వినికిడిలోపం తలెత్తింది. దీంతో శిశువు తల్లి దండ్రులు ఇటీవల బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలోని సత్యకిరణ్, మనుసృత్‌లను సంప్రదించగా, వారు శిశువుకు పలు పరీక్షలు నిర్వహించి, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో మార్చి 21న ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ఈ నెల 17న స్పీచ్‌ ప్రోసెసర్‌ను అమర్చి, పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం బాలుడు వినడంతో పాటు నోటిద్వారా పలు శబ్దాలను చేయగలుగుతున్నాడని తెలిపారు.   

మరిన్ని వార్తలు