రేషన్‌ డీలర్‌ ఆత్మహత్యాయత్నం

30 Jun, 2018 01:45 IST|Sakshi

గజ్వేల్‌ రూరల్‌: ఓ రేషన్‌ డీలర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. శుక్రవారం గజ్వేల్‌ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రేషన్‌ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా గజ్వేల్‌ రేషన్‌ డీలర్ల ఐక్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిరసన తెలిపేందుకు డీలర్లు వచ్చారు. ఈ క్రమంలో గజ్వేల్‌కు చెందిన వజీర్‌ఖాన్‌ అనే డీలర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన మిగతా డీలర్లు వజీర్‌ఖాన్‌ ఒంటిపై మంటలనుఆర్పి సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వజీర్‌ఖాన్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనతో గజ్వేల్‌ పట్టణంలో రేషన్‌ డీలర్లు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేశారు. రేషన్‌ డీలర్లకు కాంగ్రెస్‌ పార్టీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.


5 లోగా పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష
రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటి రాజు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్‌:
రేషన్‌ డీలర్ల సమస్యలపై సమ్మెకు వెనక్కి తగ్గేది లేదని, 5 లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటి రాజు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సమ్మె విరమించేది లేదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వాని కి సమ్మె నోటీసులిచ్చినా ప్రభుత్వం తమతో చర్చలు జరపలేదన్నారు. నోటీసులిచ్చిన తరువాత ఏడు రోజులు సమయం ఉంటుందని, కానీ ప్రభుత్వం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింది రావాల్సిన బకాయిల కోసం సమ్మె చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.  

ఆ అధికారంలేదు..
రాష్ట్ర ప్రభుత్వానికి డీలర్లను సస్పెండ్‌ చేసే అధికారం లేదని, అణచివేత చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల డీలర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వేలిముద్రలు, బ్లాక్‌ మార్కెట్లతో ఎలాంటి సంబంధం లేదని, అలాంటిదేదైనా ఉంటే తాను గుండు కొట్టించుకునేందుకు కూడా సిద్ధమన్నారు. 35 ఏళ్ల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామని, డీలర్ల కడుపుకాలినా ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి పెట్టడం లేదని దుయ్యబట్టారు.

డీలర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చగలరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పౌర సరఫరాలలో అవార్డు రావడానికి డీలర్లు కారణం కాదా..? అని ప్రశ్నించారు. 4వ తేదీన ఆమరణ నిరాహారదీక్ష ఎక్కడ చేస్తామనేది ప్రకటిస్తామన్నారు. డీలర్ల సంఘ గౌరవ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి తమకు సహకరించి మంత్రితో చర్చలు జరిపారని, ఆమె ఏం చెప్పినా తాము శిరసావహిస్తామన్నారు. డీలర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పిస్తే కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తామన్నారు.

డీలర్ల సమ్మె వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. తమకు ఆలిండియా రేషన్‌ డీలర్ల అసోషియేషన్‌ మద్దతు ఉందని, అవసరమైతే దేశవ్యాప్తంగా గల ఐదు లక్షల డీలర్లు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం గా ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో  దాసరి మల్లేశం,  కృష్ణమూర్తి, గడ్డం మల్లికార్జున్‌ గౌడ్, ప్రసాద్‌గౌడ్, ఆనంద్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు