పింఛన్ అర్హత వయోపరిమితి తగ్గించాలి

21 Oct, 2014 23:44 IST|Sakshi
పింఛన్ అర్హత వయోపరిమితి తగ్గించాలి

సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ అర్హత వయోపరిమితి 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించాలని మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో మజ్లిస్ ఎమ్మెల్యేలు సమావేశమై సంక్షేమ పథకాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను లబ్ధిదారులకు నగదు రూపం లో కాకుండా బ్యాంక్ ఖాతాల ద్వారా అందించాలన్నారు. నగదు రూపంలో పంపిణీ చేస్తే పక్కదారి పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతం 40 శాతం వరకు పిం ఛన్లు లబ్ధిదారులకు అందడం లేదన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా దరఖాస్తుల పరిశీలన పక్కాగా చేయాలని కోరారు. బోగస్ లభ్ధిదారులను ఎంపిక చేస్తే సం బంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యు లు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి నిబంధన దృష్టిలో పెట్టుకొని నియోజవర్గానికి ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అనుమతించిన ఆధార్ కేంద్రాల్లో సర్వీస్ చార్జీల పేరిట ఒక్కొకిరి నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని, దీంతో ఆధార్ నమోదు కోసం కుటుంబాలు సగటున రూ.1500పైగా భారం మోయకతప్పడం లేదని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకొవచ్చారు.

నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస దృవీకరణ పత్రాలను త్వరగా జారీ చేయాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్, మౌజం ఖాన్, కౌసర్ మొహియొద్దీన్, జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీ జాఫ్రీ, హైదరాబాద్ కలెక్టర్ మీనాలు సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు