విధులు మరచి టిక్‌టాక్‌

27 Jul, 2019 03:26 IST|Sakshi

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఘటన 

ఇద్దరు అప్రెంటీస్‌ విద్యార్థుల తొలగింపు  

హైదరాబాద్‌: టిక్‌టాక్‌.. మాయలో పడి కొందరు సెలబ్రిటీలుగా మారుతుంటే, మరికొందరు ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉంటూ టిక్‌టాక్‌ వీడియోలు చేసిన ఇద్దరు అప్రెంటీస్‌ విద్యార్థులను శుక్రవారం విధుల నుంచి తొలగించారు. రాంనగర్‌ సాధన పారా మెడికల్‌ కాలేజీకి చెందిన శ్యామ్‌మిల్టన్, అత్తాపూర్‌ జెన్‌ ఒకేషనల్‌ కాలేజీకి చెందిన వీణాకుమారీ.. గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో శిక్షణ కోసం అప్రెంటీస్‌లుగా చేరారు. విధులను మరచి ఫిజియోథెరపీ విభాగంలోనే పలు టిక్‌టాక్‌ వీడియోలు చేశారు.

ఆ వీడియోలు శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆస్పత్రి పాలనాయంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  టిక్‌టాక్‌ వీడియోలు చేసిన శ్యామ్‌మిల్టన్, వీణా కుమారీని విధుల నుంచి తొలగించి ఆయా కాలేజీలకు సరెండర్‌ చేశామని ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ తెలిపారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. వైరల్‌గా మారిన టిక్‌టాక్‌ వీడియోలు చేసిన వారు గాంధీ ఆస్పత్రిలో కేవలం శిక్షణ పొందేందుకు మాత్రమే వచ్చారని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు