జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల

1 Jul, 2015 17:55 IST|Sakshi
జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. బుధవారం సాయంత్రం రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వద్దకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కూడా విడుదల చేశారు.

మంగళవారం హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు  హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఏసీబీ కోర్టులోనే ఇవ్వాలని స్పష్టం చేస్తూ తీర్పు కాపీని సవరించింది. తీర్పు కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్ ఆర్డర్ కాపీలు తీసుకుని చర్లపల్లి జైలుకు వెళ్లి అధికారులకు సమర్పించారు. కాసేపటి తర్వాత రేవంత్ రెడ్డి విడుదలయ్యారు.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయసింహా, సెబాస్టియన్కు బెయిల్ మంజూరు చేసింది.
 

మరిన్ని వార్తలు