ఆదాయం తిప్పలు

5 Sep, 2014 03:48 IST|Sakshi
ఆదాయం తిప్పలు

ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వని రెవెన్యూ అధికారులు
- మీ సేవ కేంద్రాల ద్వారా నిలిచిపోయిన జారీ
- కళాశాలల్లో చేర్చుకునేందుకు యాజమాన్యాల నిరాకరణ
- దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు
 హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాలల్లో ఆప్షన్లు ఇవ్వగా... సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. కన్వీనర్ కోటా కింద సీటు వచ్చిన కళాశాలల్లో సర్టిఫికెట్లు అందజేసి రిపోర్టు చేయడమే తరువారుు. ఇక్కడే వారికి తిప్పలు వచ్చిపడ్డారుు. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని కళాశాలల యూజమాన్యాలు స్పష్టం చేస్తుండగా.. ఇన్‌కం సర్టిఫికెట్ ఇచ్చేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 
నెల రోజులుగా బంద్..
కలెక్టర్ మౌఖిక ఆదే శాలతో జిల్లాలో నెల రోజులుగా మీసేవ కేంద్రాల ద్వారా ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని చోట్ల  తహసీల్దార్లు ఎవరికి వారు ప్రకటనలు ఇస్తూ మాన్యువల్‌గా ఇన్‌కం సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మనకెందుకొచ్చిందని భావించిన తహసీల్దార్లు ఏ ఒక్కరికీ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదు. కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకూ ఇచ్చేది లేదని మండల రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసింది.
 
పొరుగు జిల్లాల్లో ఇస్తున్నా..

కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారు తెల్లరేషన్ కార్డులతో అన్ని రకాల లబ్ధి పొందుతున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయూ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది. దీన్ని సాకుగా చూపి జిల్లాలో అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని పూర్తిస్థారుులో నిలిపివేశారు. కానీ... పక్కన కరీంనగర్ జిల్లాలో మీ సేవ కేంద్రాల ద్వారా ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ యథాతధంగా నడుస్తోంది. జిల్లాలో కొన్ని చోట్ల ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసినట్లు రసీదు ఉంటే కాలేజీల నిర్వాహకులు ఊరుకుంటున్నారు. మరికొన్ని  చోట్లమాత్రం తప్పనిసరిగా ఇన్‌కం సర్టిఫికెట ఉండాలని తెగేసి చెబుతున్నారు.
 
కలెక్టర్‌కు ఫిర్యాదు
ప్రవేశాల సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగొద్దని, కేబినెట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత జారీ చేస్తామని కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... విద్యార్థులకు ఇబ్బందులు తప్పేవి. అలాంటిదేం లేకుండా సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హన్మకొండ మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు తమకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కొందరు సోమవారం నేరుగా కలెక్టర్ కిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి మాన్యూవల్ సర్టిఫికె ట్లు ఇవ్వమని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్‌లు ఉన్నందున తాత్కాలింగా అయినా... ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లావ్యాప్తంగా విద్యార్థులు కోరుతున్నారు. లేదంటే తాము కళాశాలల్లో సీటు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు