మిషన్‌ కాకతీయతో విప్లవాత్మక మార్పు: గోయల్‌

20 May, 2017 03:15 IST|Sakshi
మిషన్‌ కాకతీయతో విప్లవాత్మక మార్పు: గోయల్‌

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ పథకం నీటి వనరుల ఉపయోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్‌ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులకు రీఓరియెంటేషన్, కెపాసిటీ బిల్డింగ్‌ అనే అంశంపై శుక్రవారం హెచ్‌ఆర్‌డీలో ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల అవసరాలకు తగిన శిక్షణ కార్యక్రమాలు, అందుకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందిస్తామని ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య వెల్లడించారు.

స్వచ్ఛ హైదరాబాద్‌ ద్వారా నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్‌ కీలక పాత్ర వహించేలా ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వర్తించాలని, శిక్షణ తరగతులు అందుకు ఉపకరిస్తాయని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పరిణామాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు