సంప్రదాయమా..? చట్ట నిబంధనలా..?

18 Jun, 2015 04:20 IST|Sakshi
సంప్రదాయమా..? చట్ట నిబంధనలా..?

* పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని ‘హెబియస్’ రూపంలో సవాలు చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ
* అయితే ఇది 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయమన్న సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి
* దీంతో హెబియస్ కార్పస్ రూపంలోనా.. రిట్ పిటిషన్ రూపంలోనా... అనేది తేల్చాలని హైకోర్టు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: ఏ వ్యక్తినైనా పోలీసులు ముందస్తు నిర్బంధ చట్టం(పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తే దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొంటూ అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడం యాభై ఏళ్ల నుంచి హైకోర్టులో వస్తున్న సంప్రదాయం..
 
పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని సవాలుచేస్తూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడానికి వీల్లేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మౌఖికంగా జారీచేసిన ఆదేశం..
 గత 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న కీలక విషయాన్ని తేల్చాలని హైకోర్టు తాజాగా నిర్ణయించింది. దీనిపై లోతైన విచారణ జరపనున్నట్టు పేర్కొంది. తమ భర్తలను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారని, వారిని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన జి.అర్చన, చిత్తూరుకు చెందిన బి.హిమబిందు వేర్వేరుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్లు వేశారు.

ఇవి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం విచారణకొచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల భర్తలైన జి.రామనాథరెడ్డి, నాగేంద్రనాయక్‌లను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. పీడీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను ఇలా హెబియస్ కార్పస్ రూపంలో దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వాటిని రిట్ పిటిషన్ రూపంలో సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసుకోవాలని, ఇదే విషయాన్ని  హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఏజీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. బాంబే హైకోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పిందని వ్యాఖ్యానించింది.

దీనికి మోహన్‌రెడ్డి అడ్డుచెబుతూ.. గత 50 ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో పీడీ కేసుల్లో నిర్బంధాన్ని హెబియస్ కార్పస్ రూపంలోనే సవాలు చేస్తూ వస్తున్నామని, అదిక్కడ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. పీడీ కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయకూడదని రాజ్యాంగంలోగానీ, చట్ట నిబంధనల్లోగానీ, సుప్రీంకోర్టు తీర్పుల్లోగానీ ఎక్కడా లేదని, ఏజీకి సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసని వివరించారు. సంప్రదాయం కొనసాగుతున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు.

దీంతో ధర్మాసనం, అయితే సంప్రదాయాన్ని కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న విషయంపై లోతైన విచారణ చేపడతామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెలువరించిన తీర్పులేవైనా ఉంటే, వాటిని తమ ముందుంచాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు