దేవుడి సొమ్మే కదా..!

22 Jun, 2014 02:30 IST|Sakshi
దేవుడి సొమ్మే కదా..!

 రాజన్న సొమ్ముతో చెలగాటం..
- గదుల విచారణ విభాగంలో రూ.50వేల లోటు
- ఎవరు పూడ్చాలన్న దానిపై వాగ్వాదం..
- సిబ్బంది మధ్యన తలెత్తిన వివాదం

 వేములవాడ : దేవుడి సొమ్మే కదా.. మాకేంటి అనుకుంటున్నారు రాజన్న ఆలయ ఉద్యోగులు. ఉన్నతాధికారుల భయం అసలే  లేనట్లుంది. రాజన్న సన్నిధిలో వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మొన్న ముఖ్య బుకింగ్ కౌంటర్లలో వెలుగుచూసిన అక్రమాల లెక్కతేలకముందే నేడు వసతిగదుల విచారణ విభాగంలో మరో అక్రమం వెలుగులోకి రావడం నివ్వెరపరిచింది. ఏటా రూ.2కోట్లమేర ఆదాయం సమకూర్చే ఈవిభాగంలో నిత్యం సగటున రూ.55 వేల మేర లావాదేవీలు సాగుతాయి. తాజాగా శనివారం రూ.50 వేలమేర లోటు తలెత్తింది. ఈ మొత్తం నువ్వంటే నువ్వే.. చెల్లించాలంటూ సదరు విభాగం సిబ్బంది వాగ్వాదానికి దిగడం అందరినీ విస్తుపోయేలా చేసింది.
 
అసలేం జరిగింది...
ఓ వైపు ఆలయ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అక్రమాల పుట్టను వెలికితీసే ప నిలో నిమగ్నమైంది. ముఖ్యబుకింగ్‌తోపాటు పలు విభాగాల్లో వెలుగుచూసిన అక్రమాల లెక్కతేలేలోగానే మరోసారి లెక్కల తేడా పొడసూపింది. ఈసారి అది ఉద్యోగుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సదరు విభాగంలోని సిబ్బంది ఏకంగా నువ్వంటే నువ్వు చెల్లించాలంటూ వాగ్వాదానికి దిగడంతో కార్యాలయం దద్దరిల్లింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘రాజన్న సొమ్ము గోల్‌మాల్’ కథనంతో అన్ని విభాగాల పర్యవేక్షకులు అప్రమత్తమయ్యారు.

కిందిస్థాయి ఉద్యోగులను విశ్వసించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలోనే ఆలయానికి సమకూర్చే ఆదాయంలో సింహభాగమైన వసతిగదుల విభాగం సూపరింటెండెంట్ తమ విభాగం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. శుక్రవారం సందర్భంగా సమకూరిన ఆదాయం పెద్దమొత్తంలో ఉంటుంది గనక తేడాలు రావొచ్చన్న సందేహంతో మరోసారి పరిశీలించారు.

ఊహించినట్లుగానే రూ. 50వేలమేర లోటురావడడంతో అవాక్కయినట్లు సమాచారం. దీంతో సదరు విభాగంలోని సిబ్బందిని పిలిచి ఆరాతీశారు. ఇంకేముంది తేలుకుట్టిన దొంగల్లా సదరు సిబ్బంది చిందులు మొదలయ్యాయి. ‘తప్పు నీదంటే నీదంటూ’ పరస్పరం దూషించుకున్నారు. ఇదంతా చూస్తున్న అక్కడివారు నివ్వెరపోయారు.
 
సమగ్ర విచారణ చేపడతాం..
సిబ్బంది పరస్పర వాగ్వాదానికి దిగిన ఘటన మాదృష్టికి వచ్చింది. అసలేం జరిగిందన్నది తేల్చుతాం. ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. బహుశా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సంబంధిత విభాగం అధికారి లెక్కలు పరిశీలించడంతో ఈవైనం వెలుగుచూసిందని భావిస్తున్నాం. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తాం.
 -హరికిషన్ ఏఈవో, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధి

మరిన్ని వార్తలు