సీఎంల మార్పుపై కాంగ్రెస్ కసరత్తు | Sakshi
Sakshi News home page

సీఎంల మార్పుపై కాంగ్రెస్ కసరత్తు

Published Sun, Jun 22 2014 2:24 AM

congress party exercise to   changes of cm's

మహారాష్ట్ర, అస్సాం సీఎంల మార్పుపై మల్లగుల్లాలు
సోనియాగాంధీతో సమావేశమైన చవాన్, హూడా

 
న్యూఢిల్లీ/గువాహటి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, అస్సాం, హర్యానాల్లో ముఖ్యమంత్రుల మార్పునకు సంబంధించి శనివారం ఢిల్లీలో పలు భేటీలు, చర్చోపచర్చలు చోటు చేసుకున్నాయి. సీఎంల మార్పు వల్ల కలిగే లాభనష్టాలపై సీనియర్ నేతలు దృష్టి సారించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్‌లు వేరువేరుగా శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆదివారం ఢిల్లీకి చేరుకుని, సోమవారం సోనియా, ఇతర నేతలతో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటం, ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  సంస్థాగత మార్పులకు కాంగ్రెస్  సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనే లక్ష్యంతో కీలక చర్యలు చేపట్టాలనుకుంటోంది.

అందులో భాగంగా పార్టీ అధికారంలో ఉన్న అస్సాం, మహారాష్ట్రల్లో సీఎం మార్పు తప్పనిసరి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ‘ఏదైనా జరగొచ్చు. ఇప్పటివరకైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫిఫ్టీ-ఫిఫ్టీ అవకాశాలున్నాయి’ అని మహారాష్ట్ర సీఎం చవాన్‌ను మార్చే విషయంపై వ్యాఖ్యానించారు. అనిశ్చిత పరిస్థితి రాష్ట్రానికి మంచిదికాదని భేటీ సందర్భంగా సోనియాకు చెప్పినట్లు చవాన్ తెలిపారు.  సీఎంగా తనను తొలగిస్తున్నారన్న వార్తలు వదంతులేనని సోనియాతో భేటీ అనంతరం  హూడా వ్యాఖ్యానించారు. హర్యానా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్ కూడా హర్యానాలో సీఎం మార్పు వార్తలను తోసిపుచ్చారు. ‘సీఎం మార్పుపై ఔననను.. కాదనను.. నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని గువాహటిలో గొగోయ్ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లతోనూ భేటీ అయ్యారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం పట్ల మిత్రపక్షం ఎన్‌సీపీ కూడా సముఖంగా ఉందని సమాచారం. సీఎం రేసులో ఉన్న మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు శివాజీరావు దేశ్‌ముఖ్, శివాజీరావు మొఘేలు కూడా సోనియాగాంధీతో కాసేపు భేటీ అయ్యారు. వీరిలో దేశ్‌ముఖ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా ఉన్నారు.    
 
 
 

Advertisement
Advertisement