లాటరీ పేరుతో రూ.1.8 లక్షలకు టోకరా

30 Jun, 2015 00:12 IST|Sakshi
లాటరీ పేరుతో రూ.1.8 లక్షలకు టోకరా

సాక్షి, హైదరాబాద్: విదేశీ లాటరీ వచ్చిందంటూ సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్) పంపి, వివిధ చార్జీల పేరుతో నగదు కాజేసిన నైజీరియన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు హర్యానాలోని గుర్గావ్‌లో అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, సిమ్‌కార్డ్ స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సోమవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబెగా మిచెల్ అలియాస్ జెఫ్ మోర్గాన్ తేలిగ్గా డబ్బు సంపాదించే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా అనేక మంది సెల్‌ఫోన్లకు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపాడు. ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి కె.వెంకటేశ్వరరెడ్డికి ఓ ఎస్సెమ్మెస్ పంపాడు. యూఎస్ శాంసంగ్ లాటరీలో భారీ మొత్తం వచ్చిందనడంతో ఆకర్షితుడైన వ్యాపారి తనకు ఇంగ్లిష్ రాకపోయినా వేరే వ్యక్తి ద్వారా మిచెల్‌తో సంప్రదింపులు జరిపించాడు.

వెంకటేశ్వరరెడ్డి పూర్తిగా తన అదుపులోకి వచ్చాడని నిర్ధారించుకున్నాక వివిధ బ్యాంకుల ఖాతాల్లో రూ.1.79 లక్షలు జమ చేయించుకున్నాడు. దాదాపు 3 నెలలు ఎదురు చూసినా లాటరీ సొమ్ము రాకపోవడం.. మిచెల్ స్పందించకపోవడంతో వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు మార్చి మొదటి వారంలో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ కె.శివాజీ తన బృందంతో దర్యాప్తు చేపట్టి, నిందితుడు గుర్గావ్‌లో ఉన్నాడని గుర్తించారు. పోలీసులు వారం రోజులు శ్రమించి గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు