దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు

27 Oct, 2017 02:17 IST|Sakshi

12 వేల మందికి ట్రై సైకిళ్లు, వీల్‌ చైర్లు పంపిణీ: మంత్రి తుమ్మల

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

గురువారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో ట్రై సైకిళ్లు, వీల్‌ చైర్లు, కర్రలు, క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు, వాహనాలను అందించనున్నట్లు తెలిపారు. బధిరులకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం డే కేర్‌ సెంటర్లు ప్రారంభించాలన్నారు. స్వయం ఉపాధి పథకం కింద దివ్యాంగులకు రుణ సదుపాయంలో సబ్సిడీ గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నామని తెలిపారు. వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రూ.50 వేల చొప్పున 2,120 మంది దివ్యాంగులకు బహుమతి అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల ఆటల పోటీలకు ప్రతి జిల్లాకు రూ.లక్ష కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి మూడో శనివారం ‘స్వరక్ష’
అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెరగాలని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణ మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, మహిళల అక్రమరవాణాను శాశ్వతంగా నిరోధించాలనే లక్ష్యంతో ప్రతి మూడో శనివారం రాష్ట్రమంతా ‘స్వరక్ష’డే పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పా రు.

డిజిటల్‌ ఇండియాలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. కేంద్రాల్లో పిల్లల నమోదు, వయసు, భోజన పథకాలు ట్యాబ్‌ల ద్వారానే పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్‌ విజయేందిర, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు