రూ.50 కోట్ల పనులపై ‘ఈస్ట్’

12 Sep, 2014 00:01 IST|Sakshi

ప్రత్యేకంగా మదింపు ప్రాధికార సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం  నేడు సీఎస్ వద్ద 14 టాస్క్‌ఫోర్స్ కమిటీల సమావేశం
 
 హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 50 కోట్లు, ఆపైన చేపట్టే ప్రతీ పనిపై నిశిత పరిశీలన చేయడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎవాల్యుయేషన్ అథారిటీ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్)ను ఏర్పాటు చేయాలని పర్యవేక్షణ, మదింపుల టాస్క్‌ఫోర్స్ కమిటీ (మానిటరింగ్, ఎవాల్యుయేషన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ) తన సిఫారసులను సిద్ధం చేసింది. కర్ణాటకలో ప్రతీ రూ.ఐదు కోట్ల పనులను పర్యవేక్షించడానికి ఇలాంటి వ్యవస్థ ఉందని, కాని రాష్ట్రంలో రూ.50 కోట్లు పైబడిన అన్ని పనులపై పర్యవేక్షణ, మదింపు తరువాత ఆ పథకం సక్రమంగా సాగుతోందా? ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతున్నాయూ? లేదా అన్న అంశాన్ని కూడా ‘ఈస్ట్’ చూస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

ప్రతీశాఖ కూడా ‘ఈస్ట్’ సక్రమంగా పనిచేయడానికి ఒక శాతం నిధులు కేటాయించాలని వుదింపుల టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది.ఆయా శాఖల్లో కొన్ని కీలక సూచికలను రూపొందించి వాటిని అవి పాటిస్తున్నాయూ? లేదా అన్న అంశాన్ని కూడా ఈస్ట్ విశ్లేషిస్తుంది. ఆయా శాఖలు చేపట్టే పనులను సంబంధిత శాఖలు నెలకోమారు సమీక్షించాలని అటు తరువాత ప్రతీ మూడు నెలలకోమారు ప్రత్యామ్నాయు సంస్థతో తనిఖీలు చేయించాలని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రత్యామ్నాయ కమిటీలో ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్’ లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్’ వంటి సంస్థలను నియమించాలని పేర్కొంది. ఇలా 14 కీలక శాఖలకు నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు నివేదికలు సిద్ధం చేశాయని తెలుస్తోంది.

 నేడు సీఎస్ సమీక్ష..

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రాజీవ్‌శర్మ శుక్రవారం 14 టాస్క్‌ఫోర్స్ కమిటీల కన్వీనర్లతో సమావేశం కానున్నారు. ఈ కమిటీలు రూపొందించిన నివేదికలపై చర్చించనున్నారు. కమిటీలు తమ పని సరిగా చేశాయా? లేక ఇంకా ఏవైనా మార్పులు చేయాలా? అనే అంశంపై  ఆయన సమీక్షించనున్నారు. ఈ కమిటీలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారని సవూచారం.
 

మరిన్ని వార్తలు