గాడినపడని పాలన!

9 Sep, 2014 02:15 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కారు పాలన ప్రారంభమై వంద రోజులు గడిచినా.. జిల్లాలో పాలన ఇంకా గాడిన పడలేదు. అధికారులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, కొందరు బదిలీపై ఇక్కడికి రావడం, మరికొందరు బదిలీ అవుతుందన్న ఉద్ధేశంతో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టని కారణంగా జిల్లాలో పాలన సవ్యంగా సాగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక చేపట్టి ప్రజల అవసరాలు గుర్తించే పనిచేపట్టింది.
 
ఆ తర్వాత సమగ్ర కుటుంబసర్వే పేరుతో కుటుం బాలు, జనాభా, ప్రజల స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. సర్వే వివరాలు కంప్యూటరీకరించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. దీంతోపాటు రైతులకు రుణమాఫీని వర్తింపజేసేందుకు అర్హుల జాబితా తయారీపై అధికారులు దృష్టిపెట్టారు. ప్రభుత్వ పరంగా ఆయా కార్యక్రమాల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టడంతో ప్రజాపాలనకు కొంత ఆటంకం ఏర్పడింది. కొందరు అధికారులు తాము బదిలీ కావడం ఖాయమన్న ఆలోచనలో శాఖలపై సరైన దృష్టి పెట్టడం లేదు. వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడంతో కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ై
 
ఫెళ్ల క్లియరెన్స్ కూడా సరిగా కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్పీ, జేసీతో సహా.. ఉన్నతాధికారులు సైతం బదిలీల కోసం వేచి చేస్తుండడంతో కిందిస్థాయి అధికారులు కూడా శాఖలపై శ్రద్ధ పెట్టడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ మధ్యే జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జీడీ ప్రియదర్శిని కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌డీఓలు, డీఎస్పీ స్థాయిల్లో కూడా అధికారుల బదిలీలు జరిగాయి. అంతే కాకుండా తహశీల్దారు, ఎస్‌ఐ స్థాయి అధికారులు కూడా జిల్లాలో చాలాచోట్ల బదిలీ అయ్యారు. దీంతో కొత్తగా వచ్చిన అధికారులు పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది.
 
కీలక శాఖల్లో ఖాళీలు
కొత్తసర్కారు ఏర్పడిన తర్వాత ముఖ్య శాఖల్లోని కీలక పోస్టులకు అధికారులు వస్తారని అందరూ ఆశించినా ఖాళీలు భర్తీ కాలేదు. జిల్లా పరిషత్ సీఈఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈ స్థానంలో ఇన్‌చార్జ్ సీఈఓగా డీపీఓ రవీందర్ కొనసాగుతున్నారు. లాండ్ సర్వే విభాగానికి చెందిన ఏడీ, పోలీస్ శాఖకు సంబంధించి ఓఎస్‌డీ, పౌరసంబంధాల శాఖలో డిప్యూటీ డెరైక్టర్, డీపీఆర్‌ఓ పోస్టులు ఖాళీలుండడంతో ఇన్‌చార్జ్‌లతో కొనసాగిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి పనుల విషయం మరుగున పడిపోతోంది. అసలు పనులు చేయడానికి ఏమాత్రం మనసు పెట్టలేకపోతున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. విద్యాసంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తున్నా రెగ్యులర్ ఎంఈఓలను నియమించడంపై దృష్టిపెట్టలేదు.

మరిన్ని వార్తలు