దశల వారీగా పాఠశాలలు!

30 May, 2020 04:29 IST|Sakshi

విద్యా శాఖపై సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం

జూలై 1 లేదా 15 నుంచి స్కూళ్ల ప్రారంభం

టీచర్లు మాత్రం జూన్‌ 12 నుంచే స్కూళ్లకు?

10–15 రోజుల తర్వాత చర్చించాలని నిర్ణయం

తొలుత 7–10 క్లాసుల విద్యార్థులకు!

ఆ తర్వాత అప్పర్‌ ప్రైమరీ తరగతులు

సిలబస్‌ తగ్గింపు వద్దని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దశల వారీగా స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిస్థితిని బట్టి జూలై 1 నుంచి లేదా 15 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అధికా రులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడే స్కూళ్ల ప్రారంభంపై పెద్దగా నిర్ణయాలు లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఒకవేళ కరోనా అదుపులోకి వస్తే జూలైలో ప్రారంభించాలని, అప్పుడు మొదట 7, 8, 9, 10 తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనకు వచ్చారు.

ఆ తర్వాత అప్పర్‌ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. టీచర్లను మాత్రం పాఠశాలల పునఃప్రారంభ దినమైన జూన్‌ 12 నుంచే వచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీచర్లంతా గ్రామ పంచా యతీల సమన్వయంతో పాఠశాలలను శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్‌ చేయించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల నుంచి నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలన్న అంశంపైనా చర్చించారు.

ఎక్కువుంటే షిఫ్ట్‌ పద్ధతిలో..
పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్‌ పద్ధతుల్లో కొనసాగించాలని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో ఇది అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, డిజిటల్‌ తరగతులు, కేబుల్‌ టీవీ ద్వారా తరగతుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వాస్తవానికి ఆన్‌లైన్‌ బోధన ప్రత్యామ్నాయం కానే కాదని పేర్కొన్నా.. ఉన్నత తరగతులకు ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ప్రత్యక్ష బోధన లేకుంటే ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, భౌతిక దూరం పాటించడం గ్రామీణ పాఠశాలల్లో పెద్దగా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కరోనా అదుపులోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపైనా విద్యా శాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరో 10–15 రోజుల తర్వాత కరోనా పరిస్థితిని చూసి మళ్లీ సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోగా అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతోనూ ఓసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.

జూలై 15 నుంచి ఇంటర్‌ తరగతులు
ఇంటర్‌ ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్‌ విద్యా కార్యక్రమాలపైనా బోర్డు అధికారులు మంత్రికి నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే ఇంటర్‌లో సిలబస్‌ తగ్గించొద్దని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే సిలబస్‌ అలాగే ఉండాలని, అవసరమైతే నష్టపోయిన పని దినాలను ఆన్‌లైన్‌ బోధన ద్వారా సర్దుబాటు చేయాలని సూచించారు. భేటీలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, పాఠశాల విద్య సీనియర్‌ అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు