మద్యం మాఫియా.. జోరు జిల్లాలో యథేచ్ఛగా దందా

24 Apr, 2015 01:10 IST|Sakshi

- గోవా, కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమంగా దిగుమతి
- బెల్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు
- ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటున్నది గోరంతే

మద్యం మాఫియా జిల్లాలో వెళ్లూనుకుంది. మద్యం వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంది. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. జోరుగా వ్యాపారాన్ని సాగిస్తోంది. ప్రభుత్వ మద్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్న సదరు ముఠా కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటోంది. ఈ దందా వెనుక కొందరు అధికారుల హస్తమున్నట్టు తెలుస్తోంది. వారి అండదండలతోనే మాఫియా దర్జాగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుందన్న ఆరోపణలున్నాయి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమ పై మద్యం మాఫియా దాడి చేస్తోంది. మాఫియా దెబ్బకు జిల్లాలోని ప్రభుత్వ మద్యం అమ్మకాలు భారీగా డీలాపడ్డాయి. సదరు ముఠా గోవా రాష్ట్రానికి చెందిన డిస్టిలరీల నుంచి ఇబ్బడిముబ్బడిగా అక్రమ మద్యాన్ని దిగుమతి చేసుకొని బెల్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. ఈ దెబ్బకు ఈ ఒక్క నెలలోనే సుమారు 3.5 లక్షల కేసుల మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. నిరుపేద, సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే ఛీప్, మీడియం బ్రాండ్ లిక్కర్ విక్రయాలు భారీ ఎత్తున పడిపోయాయి.

పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం దొంగచాటుగా దిగుమతి చేసుకొని వైన్ షాపుల ద్వారా విక్రయించడం వల్లే ప్రభుత్వ మద్యం విక్రయాలు త గ్గుతున్నట్టు ఎక్సైజ్  నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇలాంటి మద్యాన్ని ఎకై ్సజ్ పరిభాషలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) అంటారు.  నేర చరిత్ర కలిగిన కొంతమంది ముఠాగా ఏర్పడి పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నారని ఇటీవల జరిగిన ఎకై ్సజ్ అధికారుల సమీక్షలో తేలింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లారీలు, కంటెయినర్ల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తరలిస్తున్నారు.

3.5 లక్షల కేసుల తేడా...
ఎక్సైజ్ అధికారుల అంచనాల ప్రకారం ఏటా కనీసం 10 శాతం చొప్పున మద్యం విక్రయాలు పెరగాలి. అందుకు తగ్గట్టుగానే టీఎస్‌బీసీఎల్ అధికారులు వివిధ రకాల బ్రాండ్లకు చెందిన మద్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటారు. గత పదేళ్లుగా ఎక్సైజ్ అధికారుల అంచనాల్లో తేడా రాలేదు. కానీ ఈ ఏడాది జిల్లా మద్యం విక్రయాల్లో భారీ తేడా కన్పించింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఇప్పటివరకు 34.5 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోయింది. బీరు అమ్మకాలతో కలిపి రూ.23 కోట్ల ఆదాయం వచ్చింది. 2014 ఏప్రిల్ మాసంలో 38.2 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది. ఎక్సైజ్ శాఖ అంచనాల ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది కనీసం 10 శాతం అంటే 38 వేల కేసుల మద్యం అదనంగా అమ్ముడుపోవాలి. కానీ మద్యం మాఫియా దెబ్బతో 3.5 లక్షల కేసుల మద్యం అమ్మకాల లోటు ఏర్పడింది.

తక్కువ ధరకే అక్రమ లిక్కర్...
జిల్లాలో మద్యం వినియోగం పెరిగినట్టు కన్పిస్తున్నా అందుకు తగ్గట్టుగా టీఎస్‌బీసీఎల్ నుంచి మద్యం కొనుగోళ్లు జరగలేదు. మీడియం లిక్కర్ బ్రాండ్ కేసు ధర (12 ఫుల్ బాటిల్స్) మన డిపోల్లో రూ.4,800 ఉంది.  మాఫియా లీడర్లు డిస్టిలరీల నుంచి కేవలం రూ.1,100కు కొనుగోలు చేసి మద్యం వ్యాపారులకు రూ.2,300కు అమ్ముతున్నారు. మరో రూ.1,000 అధికారుల మామూళ్ల కింద పోతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో వ్యాపారులు మద్యం మాఫియా వలలో పడుతున్నారు. ఈ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మద్యం విక్రయాల్లో తేడా వచ్చినా ఎక్సైజ్ అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు.

పట్టుకుంది గోరంతే...
గోవాలో అక్రమ మద్యం ఉత్పత్తి చేస్తున్న ఒకే ఒక్క డిస్టిలరీని మాత్రమే మన ఎక్సైజ్ అధికారులు ఇటీవల గుర్తించారు. కొంతమందిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు ద్వారా ఎక్సైజ్ అధికారులు ఆపగలిగింది కేవలం 10 నుంచి 20 శాతం అక్రమ దందాను మాత్రమే. ఇంకా అనేక మాఫియా ముఠాలు జిల్లాలో పని చేస్తున్నట్టు సమాచారం. ‘అధిక ఆదాయం’ కోసం ఎక్సైజ్ అధికారులే పెంచి పోషించిన బెల్ట్ దుకాణాల ద్వారా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని దుకాణాల్లో మద్యం అమ్మకాలు ప్రివిలేజ్ ఫీజు కట్టే స్థాయికి వచ్చినందున వ్యాపారులు అక్రమ మద్యం కోసం ఎగబడుతున్నట్టు సమాచారం. అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు పదును పెట్టకపోతే ఎక్సైజ్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు