నేడు సమ్మక్క కల్యాణం

31 Jan, 2018 11:27 IST|Sakshi
పున్నమి వెలుగులో సారలమ్మ గద్దె

పగిడిద్దరాజుతో వివాహం

ఆదివాసీ పద్ధతిలో రెండేళ్లకోసారి పెళ్లి

ముహూర్తంగా మాఘశుద్ధ పౌర్ణమి 

మేడారంలోని సమ్మక్క ఆలయమే పెళ్లి వేదిక

రాత్రి గద్దెలపైకి చేరనున్న పగిడిద్దరాజు, 

సారలమ్మ, గోవిందరాజులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: లక్షలాది మంది భక్తుల సాక్షిగా వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం వైభవంగా జరగనుంది. మాఘమాసంలో మేడారం గ్రామం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదీవాసీ సంప్రదాయం. ఇందుకోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వారికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంట లేని వారు కోళ్లు, మేకల వంటివాటిని సమర్పించుకునేవారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. 

సమ్మక్క ఆలయమే వేదిక..
మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత  వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. ఈ సారి బుధవారం, పౌర్ణమి ఒకేరోజున(జనవరి 31) రావడం విశేషం. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. ప్రధాన పూజారి పెనక బుచ్చిరాములుతోపాటు ఇతర పూజారులు సురేందర్, మురళీధర్‌ పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని 65 కిలోమీటర్లు కాలినడకన మేడారానికి తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలో పెనక వంశీయుల ఇంట్లో మంగళవారం రాత్రి బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం కాలినడకన మేడారం బయల్దేరుతారు. ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారి కాక సారయ్య, కాక కిరణ్‌ ఇతర పూజారులు తీసుకొస్తారు.

సమ్మక్కకు కల్యాణం..
మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న విడిది గృçహానికి  వస్తారు. సమ్మక్క నుంచి ఆహ్వానం రాగానే వీరు మేడారంలోని ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెళ్లికొడుకు  పగిడిద్దరాజు వచ్చాడంటూ సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. ఈ కబురు అందుకున్న సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును సమ్మక్క గుడిలోనికి ఆహ్వానిస్తారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. అనంతరం సమ్మ క్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలిసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతాడు. 

(ఎడ్లబండ్లపై మేడారానికి తరలివస్తున్న భక్తులు) 

లక్షలాది మంది రాక
సమ్మక్క–పగిడిద్దరాజు వివాహం అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. అమ్మలను దర్శించుకుని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనేది వారి నమ్మకం. మరుసటిరోజు(గురువారం) శక్తి రూపంలో చిలకలగుట్టపై కొలువైన సమ్మక్క తల్లి.. మేడారం గద్దెల మీదకు చేరుకుంటుంది. దీంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.    

సారలమ్మ ఆగమనం నేడే..
మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యా ణం జరిగిన తర్వాత సారలమ్మతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. 

>
మరిన్ని వార్తలు