సీఎం కేసీఆర్‌ ప్రసంగాలే ప్రేరణ

27 Mar, 2019 04:51 IST|Sakshi
సమ్మోహనాస్త్రం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, జూలూరు, శ్రీనివాసగౌడ్‌

‘సమ్మోహనాస్త్రం’ పుస్తకావిష్కరణలో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉపన్యాసాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలం గాణ ఉద్యమంలో, కొత్త రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రసంగా లను తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ సంకలనం చేసి ‘సమ్మోహనాస్త్రం’పేరుతో ముద్రించిన పుస్తకాన్ని కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మాట తుపాకీ తూటా కంటే శక్తివంతమైనదని ప్రజలను కదిలించే ఉపన్యాసానికి యుద్ధ ట్యాంకుల కంటే తిరుగులేని శక్తి ఉంటుందన్నారు.

కేసీఆర్‌ తన మాటలతో, ఉపన్యాసాలతో రాష్ట్ర సాధ న ఉద్యమాన్ని నడిపి గెలిపించిన తీరును జూలూరు గౌరీశంకర్‌ సమ్మోహనాస్త్రంలో వివరించారని కేటీఆర్‌ అన్నారు. ఆయన ఉపన్యాసాల్లోని ముఖ్యమైన మాటలను పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన అభినందనీయమని కొనియాడారు. అతి క్లిష్టమైన ఆర్థిక అంశాలను తన మాటలతో జనానికి సులభంగా అర్థమయ్యేలా కేసీఆర్‌ వివరించిన తీరును దీనిలో పొందుపరిచారన్నారు. ఎన్నికల వేళ 82 సభల్లో కేసీఆర్‌ ఉపన్యాసాలతో పాటుగా 51 నెలల ఆయన పాలన సారాన్ని రచయిత ప్రజల ముందు నిలిపారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శాసన మండలి సభ్యులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరక్టర్‌ నారా కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు