జోరుగా ఇసుక దందా

17 May, 2019 12:43 IST|Sakshi
మిర్యాలగూడకు ఇసుక తరలిస్తున్న నంబర్‌ ప్లేట్లు లేని ట్రాక్టర్లు

ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ అనుమతులు, ఇతర చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిచేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. నంబర్‌ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. వేములపల్లి మండలంలోని సల్కునూరు, రావులపెంట పరిసర ప్రాంతాలలోని పాలేరు వాగునుంచి ఇసుక రవాణాకు అనుమతి ఉంది.

అయితే వ్యాపారులు రెండు ట్రాక్టర్లకు అనుమతి తీసుకుని వాటివెంట మరో ఐదారు ట్రాక్టర్లను (అనుమతి లేనివి) నింపి మిర్యాలగూడ పట్టణానికి తరలిస్తున్నారు. వీటికి నంబర్‌ప్లేట్లు ఉండవు. ఇలా రోజుకు 20 ట్రాక్టర్ల ఇసుక రవాణా జరుగుతోంది. నంబర్‌ ప్లేట్‌లు కూడా లేని ట్రాక్టర్లకు అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారనే విషయం ప్రశ్నార్థకం.

మిర్యాలగూడ : ద్విచక్ర వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేకుంటేనే పోలీసులు ఆపి జరిమానా విధిస్తారు. కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహించిన సమయంలోనూ రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలుంటే వాటిని అక్కడికక్కడే  సీజ్‌ చేస్తారు. కానీ నంబర్‌ ప్లేట్లు కూడా లేని ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే కనీసం మందలించే నాథుడే లేడు..ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోకుండానే..ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి తెచ్చింది.

ఎవరైనా ఇసుక కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటేను అనుమతి లభిస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో అనుమతులు పొందకుండా భారీగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఒక ట్రాక్టర్‌ ఇసుకకు మూడు వేల రూపాయలకు విక్రయిస్తున్నా రు. రోజుకు 20 ట్రాక్టర్ల ద్వారా 80 ట్రి ప్పు ల ఇసుకను వేములపల్లి మండలం నుంచి మిర్యాలగూడ పట్టణానికి తరలి స్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులు. ఉదయం వేళల్లోనే కాకుండా రాత్రి 8 గంటల వరకు   దందా కొనసాగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా..
ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుంటే రవాణా చేయడానికి పర్మిషన్‌ తీసుకున్న ట్రాక్టర్‌ యజమానులే ఇసుకను తరలించాల్సి ఉంది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఇసుక రవాణా చేయడానికి పర్మిషన్‌ తీసుకున్న ట్రాక్టర్‌ యజమానికి ఆర్‌సీ బుక్, లైసెన్స్‌ ఉన్న డ్రైవర్‌ ఉంటారు. బుకింగ్‌ చేసుకున్న వారికి పర్మిషన్‌ ఉన్న ట్రాక్టర్ల ద్వారానే ఇసుక రవాణా చేయడంతో పాటు వినియోగదారుడి ఫోన్‌కు ట్రాక్టర్‌ నంబర్‌తో మెసేజ్‌ కూడా వస్తుంది. కానీ, నంబర్‌ ప్లేట్‌లు కూడా లేని ట్రాక్టర్లకు ఎలా అనుమతి ఇస్తున్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అనుమతి లేకుండా నంబర్‌ ప్లేట్‌లు కూడా లేని ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేదే ప్రశ్న. వేములపల్లి మండలంలోని సల్కునూరు, రావులపెంట పరిసర ప్రాంతాల్లోని పాలేరు వాగు నుంచి ఇసుకను మిర్యాలగూడకు జోరుగా తరలిస్తున్నారు.
 
దందా సాగుతుంది ఇలా..
వేములపల్లి మండలంలోని పాలేరు వాగునుంచి నంబర్‌ ప్లేట్లు లేని పది ట్రాక్టర్లు ఇసుక లోడుతో బయలుదేరుతాయి. వాటికి ముందుగా ఆన్‌లైన్‌లో అనుమతులు ఉన్న రెండు ట్రాక్టర్లు వెళ్తాయి. అంతకంటే ముందుగా ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి రెక్కీ నిర్వహిస్తాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న విషయాన్ని తెలియజేయడానికి ద్విచక్ర వాహనంపై వచ్చే వ్యక్తి గమనిస్తాడు.

అధికారులు ఉంటే ముందుగా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న వాహనాలను నిలిపి చెకింగ్‌ చేస్తారు. ఆ సమయంలో అధికారులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని నంబర్‌ ప్లేట్‌లు లేని అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్లకు సమాచారం అందిస్తాడు. దీంతో అప్రమత్తమవుతున్న డ్రైవర్లు ఏ దైనా ఒక గ్రామంలో రోడ్డు పక్కన నిలుపుతున్నారు. ఇలా రోజుకు 20 నంబర్‌ ప్లేట్‌లు లేని ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు