ఇప్పుడు బడికెట్ల పోవాలె?

21 Oct, 2019 08:08 IST|Sakshi

నేటి నుంచి పాఠశాలలు  పునఃప్రారంభం

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె  

గ్రామీణ ప్రాంతాలకు నడవని బస్సులు

సాక్షి, కరీంనగర్‌ :  దసరా సెలవులు... తర్వాత ఆర్టీసీ సమ్మెతో మరో వారం రోజులు పొడిగింపు ముగియడంతో ఎట్టకేలకు సోమవా రం విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నా యి. 23 రోజుల సెలవులు ముగియడంతో ఇక పాఠశాలలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈమేరకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. అయితే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుం డడంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు, దూర ప్రాంత పాఠశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  

బుతకమ్మ, దసరా పండుగ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముందుగా సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. 14న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాశాఖ మరోసారి పాఠశాలలకు ఈనెల 14 నుంచి ఈనెల19 వరకు మళ్లీ పొడగించింది. దీంతో ఏకంగా విద్యాసంస్థలు 23 రోజులపాటు మూతపడడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.  

40 శాతమే సిలబస్‌ పూర్తి... 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు కేవలం 40 శాతం వరకే సిలబస్‌ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ చివరి నాటికి 50 శాతంపైగా సిలబస్‌ పూర్తికావాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు నవంబర్‌ మొదటి వారం నుంచే స్టడీ అవర్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పాఠశాలలకు పదేపదే సెలవులు రావడం, ఏకంగా దసరా సెలవులతోపాటు ఆర్టీసీ సమ్మె కారణంతో 23 రోజులు సెలవులు ఉండడంతో విద్యాప్రణాళిక అస్తవ్యస్తంగా మారింది. జనవరి చివరి మాసం ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని తరగతులకు సిలబస్‌ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పాఠశాల విద్యావ్యవస్థ గాడిన పడుతుందో లేదోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రధాన రూట్లలోనే బస్సులు.. 
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని ప్రధాన రూట్లలోనే బస్సులు నడుస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌ – 1, 2 డిపోలతోపాటు, హుజూరాబాద్, డిపోల నుంచి హైదరాబాద్, గోదావరిఖని, సిరిసిల్ల, వేములవాడ, మంచిర్యాల లాంటి ప్రధాన రూట్లలోనే బస్సులు నడిపిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రూట్లకే అధికారులు బస్సులను పంపిస్తున్నారు. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 16 రోజులుగా ఆర్టీసీ బస్సు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  

40 శాతం గ్రామాలకు వెళ్లేవి.. 
జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 700 బస్సులు ఉన్నాయి. వీటిల్లో 30 బస్సుల వరకు గ్రామీణ ప్రాంతాల్లో నడిపించేవారు. అన్ని గ్రామాల్లో పాఠశాలల వేళలకు బస్సులను నడుపుతుండడంతో చాలా మంది ఉపాధ్యాయులు జిల్లా కేంద్రం నుంచే అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా హైస్కూల్‌ కోసం మండల కేంద్రాల్లోని పాఠశాలలకు వెళ్తున్నారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండడంతో బస్సుపాసులున్న విద్యార్థులతోపాటు,  ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లేవారు మరో 800 మంది ఉంటారు. వీరికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.  

ప్రత్యేక బస్సులు నడపకుంటే ఇబ్బందే..  
దసరా సెలవులు 23 రోజులు ఇవ్వడంతో ఇప్పటికే విద్యార్థులు చదువుపరంగా చాలా నష్టపోయారు. జిల్లాలోని చాలా గ్రామాల నుంచి పాఠశాల, ఇంటర్, డిగ్రీ, ఇతర చదువులకు జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. నేటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు బస్సులు నడిపించకుంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు, తల్లిండ్రులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని పల్లెలకు బస్సులు నడిపించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు