సైన్స్‌ అకాడమీ సాంకేతిక సలహాలివ్వాలి 

29 Apr, 2018 04:14 IST|Sakshi

ఆధునిక పంటల విధానాలపై పరిశోధనలు జరగాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు మరింత విజయవంతం కావాలంటే రాష్ట్ర సైన్స్‌ అకాడమీ ప్రభుత్వానికి శాస్త్ర, సాంకేతిక పరమైన సలహాలు, సూచనలు అందించాల్సిన అవసరమెంతైనా ఉందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తులు తయారు చేసేందుకు ఆధునిక పంటల విధానాలపై యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. సైన్స్‌ అకాడమీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో నిర్వహించిన యువ శాస్త్రవేత్తల అవార్డు ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ.25 వేల కోట్లు వెచ్చించి మంచినీటి సరఫరా, చెరువుల మరమ్మతులు, డ్యామ్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో వ్యవసాయ రంగం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం పది మిలియన్‌ ఎకరాల భూమిలో సాగుబడి జరుగుతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో మరో 8 లక్షల ఎకరాలను సాగుబడిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా మోనోపలి పంటల విధానం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంత అంతరాయం జరుగుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలను సామాన్య మానవులకు తెలియజేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు.  

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి 
నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు పరిశోధనా సంస్థలు మార్గాలను కనుక్కోవాల్సిన అవసరముందన్నారు. ప్రజారోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. తక్కువ ఖర్చుతో రోగాల నివారణ జరిగే విధంగా మందుల తయారీ జరగాలని, ఆ దిశగా పరిశోధనా ఫలితాలు ఉండాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు యువ శాస్త్రవేత్తలకు మంత్రి అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్‌ వర్సిటీ మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మెహతా, సైన్స్‌ అకాడమీ ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు