ఆచూకీ కోసం మూడేళ్లు అన్వేషణ

11 Aug, 2018 02:03 IST|Sakshi
ప్రియాంక తల్లి, తమ్ముడు

అక్క కోసం ఓ తమ్ముడి తపన

ప్రేమ వివాహం చేసుకున్న సోదరి 

ఇద్దరు పిల్లలను కన్నాక కట్టుకున్నోడే చంపి బావిలో పడేసిన వైనం 

చివరికి హత్యకు గురైనట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు 

పోలీసుల అదుపులో నిందితుడు!

నాంపల్లి(మునుగోడు): సోదరి ఆచూకీ కోసం ఓ తమ్ముడు పడిన తపన ఇది. పద్నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఆచూకీ లేకుండా పోయిన అక్క కోసం నిరంతరం వెతికాడు అతడు. డిటెక్టివ్‌లా పరిశోధించాడు. చివరికి తన అక్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే చంపి బావిలో పడేసినట్లు తెలుసుకున్నాడు. ఇద్దరు పిల్లలను అమ్మేసినట్లు వెల్లడి కావడంతో షాక్‌కు గురయ్యాడు.  

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మోర హనుమంతు హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతనికి నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ప్రియాంక పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా 2004 సంవత్సరంలో పెళ్లి చేసుకుని స్వగ్రామమైన వెంకెపల్లిలో కాపురం పెట్టారు. వారికి ఓ కుమారుడు, కూతురు జన్మించారు.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. హనుమంతు తన భార్య ప్రియాంకను చంపి మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామశివారులోని పాడుబడిన బావిలో పడేశాడు. కుమారుడిని కొండమల్లేపల్లిలో తెలిసిన వారికి విక్రయించాడు. కూతురును హైదరాబాద్‌లో వేరొకరికి అమ్మాడు. అతను మాత్రం మరో వివాహం చేసుకుని స్వగ్రామంలోనే జీవనం సాగిస్తున్నాడు. ప్రియాంక ఎవరిని ప్రేమించిందన్న విషయం ఇంట్లో తెలియకపోవడంతో వారు ఆమె ఆచూకీని వారు కనుక్కోలేకపోయారని తెలుస్తోంది.  

మూడేళ్లుగా పరిశోధన.. 
ప్రియాంక సోదరుడు ఉపేందర్‌కు ప్రస్తుతం 21 ఏళ్లు మూడేళ్లుగా అతను అక్క కోసం తిరుగుతున్నాడు. తన అక్క ప్రేమించిన వ్యక్తి హైదరాబాద్‌లో క్రూజర్‌ డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుసుకున్నాడు. ఆరా తీసి అడ్రస్‌ కనిపెట్టాడు. వెంకెపల్లికి చేరుకుని సోదరి కోసం వెతికాడు. కానీ ఆమె కనిపించలేదు. ఏమి జరిగిందని గ్రామస్తులవద్ద ఆరా తీశాడు. మూడేళ్ల క్రితమే ప్రియాంకను చంపివేసినట్లు పలువురు గ్రామస్తులు తెలిపారు. ‘నిన్ను కూడా చంపేస్తాడు. వెళ్లిపో’అని చెప్పారు. దీంతో జరిగిన ఘోరాన్ని మొదట ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో చెప్పాడు.

వారి సూచనమేరకు మర్రిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ప్రస్తుతం నిందితుడు హనుమంతును అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమదైన శైలిలో విచారణ జరపగా ప్రియాంకను చంపి, ఇద్దరు పిల్లలను విక్రయించినట్లు ఒప్పుకున్నాడని తెలిసింది. ప్రియాంక తమ్ముడు ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు