సబ్సిడీ గొర్రెలేవి..?

11 Feb, 2019 12:10 IST|Sakshi

జనగామ అర్బన్‌: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. డీడీలు తీసి గొర్లకాపరులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు మాత్రమే ఇచ్చారు. మొదటి విడతలోనూ 313 యూనిట్లకు ఇప్పటి వరకు సబ్సిడీ అందలేదు. జనగామ జిల్లాలో 21,704 గొర్రెల యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం మొదటి విడతలో 10,750 యూనిట్లను ఎంపిక చేసింది.

10,437 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. ఇంకా 313 యూనిట్లకు సబ్సిడీ ఇప్పటి వరకు అందలేదు. రెండో విడతలో 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉంది. వీరంతా డీడీలు తీసి గొర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు ఇచ్చారు. 9547 యూనిట్లకు ఇవ్వాల్సి ఉంది.  స్టేషన్‌ఘన్‌పూర్‌లో 55 మందికి, దేవరుప్పులలో 11 మందికి పంíపిణీ చేయగా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఒక్కరికీ పంపిణీ చేయకపోవడం గమనార్హం.

మొదటి విడతకే మోక్షంలేదు..
జిల్లాలో మొదటి విడతలో పూర్తిస్థాయిలో గొర్లను పంపిణీ చేయలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో 4,325 యూనిట్లుకు 4,236 యూనిట్లు, పాలకుర్తిలో 2,525 యూనిట్లుకు 2,451 యునిట్లు పంపిణీ చేశారు. రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో అత్యధికంగా 36 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

విడుదల కాని బడ్జెట్‌..
మొదటి విడతలో సబ్సిడీ గొర్రెల పధకానికి రూ.100 కోట్లు కేటాయించి విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడతలో దాదాపు 14 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సమాచారం. దీంతో నిధులు కేటాయించిన మేరకు అధికారులు పట్టణంలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ కూడా పంపిణీకి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ విడుదలైతే పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

అందని ఇన్సూరెన్స్‌..
జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 400లకు పైగా సబ్సిడీ గొర్లు మృత్యువాత పడ్డాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే ఇన్సూరెన్స్‌ మంజూరైంది. మిగతా వాటికి మంజూరు కాలేదు. మంజూరైన డబ్బులను కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. సబ్సిడీ గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్న గొర్లు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారులు చొరవ చూపాలి..
సబ్సిడీ గొర్రెల మంజూరులో అధికారులు చొరవ చూపాలి. రెండో విడతకు సంబంధించి బ్యాంకులో డీడీ తీసి దాదాపు ఆరునెలలు గడిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన వారికి న్యాయం చేయాలి. – కూకట్ల చంద్రయ్య, గానుగుపహాడ్‌

లబ్ధిదారులకే డబ్బులు అందజేయాలి..
ప్రభుత్వం అందించే సబ్సిడీని లబ్ధిదారులకు నేరుగా అందజేయాలి. ప్రభుత్వం అందజేసే గొర్రెలకు ఇన్సూరెన్స్‌ రావడం లేదు. దీంతో లబ్ధిదారులకు నష్టం కలుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – జాయ మల్లేషం,  జీఎంపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు

విడతల వారీగా అందజేస్తున్నాం..
ప్రభుత్వం విడుదల చేస్తున్న బడ్జెట్‌కు అనుగుణంగా అర్హులైన యూనిట్లను మంజూరు చేస్తున్నాం. కొంతకాలంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందువల్ల అందజేయలేకపోయాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నతాధికారులు సూచనల మేరకు అందజేస్తాం.– భిక్షపతి, జనగామ జిల్లా వెటర్నరీ అధికారి 

మరిన్ని వార్తలు