సదస్సు సక్సెస్‌కు సీనియర్‌ ఐపీఎస్‌లు

24 Nov, 2017 02:00 IST|Sakshi

9 మంది ఐపీఎస్‌లు, ఇద్దరు నాన్‌కేడర్‌ ఎస్పీలు..  

ఒక్కో ప్రాంతంలో    ఒక్కొక్కరికి బాధ్యత

ఎయిర్‌పోర్టు, మెట్రో, హెచ్‌ఐసీసీకి ఒక్కో ఐజీ కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌తో పాటు హాజరయ్యే వేలాదిమంది ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులను రంగంలోకి దించింది. ఈ మేరకు 9 మంది సీనియర్‌ ఐపీఎస్‌లతో పాటు ఇద్దరు నాన్‌ కేడర్‌ ఎస్పీలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత..
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఐజీ అనిల్‌కుమార్‌ మెట్రో రైలు ప్రారంభ వేడుకల భద్రత ఏర్పాట్లు పరిశీలించాలని డీజీపీ సూచించారు. అలాగే అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులతో సదస్సుకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ పూర్తి బాధ్యతలను ఐజీ స్టీఫెన్‌ రవీంద్రకు అప్పగించారు. బందోబస్తు, భద్రత, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం పర్యవేక్షించాలని సూచించారు.  
సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు సదుపాయాలు, రవాణా తదితర వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డికి స్పష్టం చేశారు.
వీఐపీల ట్రాఫిక్‌ రూట్లు, భద్రతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని గ్రేహౌండ్స్‌ ఐజీ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు.
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పర్యవేక్షకురాలిగా ఐజీ షికాగోయల్‌ను నియమించారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు వచ్చే ప్రతినిధులు, ఇతర వీవీఐపీల వ్యవహారాలు పర్యవేక్షించి వారు బస ప్రాంతాలకు, సదస్సుకు చేరుకునేలా ఏర్పాట్లు చూసుకోవాలని పేర్కొన్నారు.  
ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌ హాజరయ్యే ఫలక్‌నుమా విందు కార్యక్రమాలు, అక్కడి భద్రత వ్యవహారాలు పర్యవేక్షిస్తూ అక్కడే ఉండాలని ఐజీ టి.మురళీకృష్ణను ఆదేశించారు.
గోల్కొండ కోట ఇన్‌చార్జిగా ఐజీ స్వాతిలక్రా వ్యవహరించనున్నారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు సందర్శనకు వచ్చే ఇతర వీవీఐపీల భద్రత తదితర వ్యవహారాలు చూసుకోనున్నారు.
సదస్సు జరిగే ప్రాంతం, సైబరాబాద్, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కో–ఆర్డినేషన్‌ బాధ్యతలు చూసుకోవాలని డీసీపీ అవినాష్‌ మహంతి ఆదేశించారు.
మియాపూర్‌ ప్రాంతాల్లో ప్రధాని పర్యటన, లోకల్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీసీపీ ప్రకాశ్‌రెడ్డికి సూచించారు.  
హైదరాబాద్‌ కమిషనర్‌కు ఎస్పీ కోటిరెడ్డిని అటాచ్‌ చేశారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యల్లో పోలీస్‌ కమిషనర్‌కు సహకారం అందించడంతో పాటు భద్రత వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు.
సౌత్‌జోన్‌ భద్రత వ్యవహారాల్లో ఉన్నతాధికారులకు సహాయ సహకారాలు అందించేలా అందుబాటులో ఉండాలని డీసీపీ బాబురావును ఆదేశించారు.


రేపు రిపోర్ట్‌ చేయాలి..
భద్రతా, ట్రాఫిక్‌ తదితర వ్యవహారాలు పర్యవేక్షించేందుకు నియమించిన అధికారులంతా శనివారం రిపోర్టు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల్లో స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని డీజీపీతో పాటు శాంతి భద్రతల అదనపు డీజీపీ, ఇద్దరు కమిషనర్లకు చేరవేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి సదస్సు విజయవంతానికి కృషిచేయాలని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు