కొత్త జీవితానికి స్టార్టప్‌

24 Nov, 2017 01:56 IST|Sakshi

జీఈఎస్‌లో స్టార్టప్‌లకు పిచ్‌ కాంపిటీషన్స్‌

పెట్టుబడులు, భాగస్వాములను రాబట్టుకోవచ్చు

2018–స్టార్టప్‌ వరల్డ్‌ కప్‌నకు అర్హత సాధించి మిలియన్‌ డాలర్లు గెలవచ్చు

విజేతలకు ఎన్నో బహుమతులు, క్రెడిట్లు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్‌ మధ్య ‘మిలియన్‌ డాలర్ల’ పోటీకి తెరలేచింది. హైదరాబాద్‌ మహానగరంలో ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) ఈ పోటీకి వేదిక కానుంది. అమెరికా ప్రభుత్వ విభాగం గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ థ్రో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీఐఎస్‌టీ) ఆధ్వర్యంలో జీఈఎస్‌లో స్టార్టప్‌లకు లైవ్‌ పిచ్‌ కాంపిటిషన్‌ పోటీలను నిర్వహించనున్నారు.

జీఈఎస్‌లో దృష్టి సారించనున్న ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, ఫైనాన్షియల్‌ టెక్‌ అండ్‌ డిజిటల్‌ ఎకానమీ, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు చెందిన స్టార్టప్‌లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. మన దేశంతోపాటు అమెరికా, ఇతర దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఈ పోటీల్లో పాల్గొని తమ ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలను నిర్వాహకులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించనున్నారు.  

పోటీకి ఆన్‌లైన్‌ ఓటింగ్‌..
కాంపిటిషన్‌లో పాల్గొనే స్టార్టప్‌ల ఎంపిక కోసం జీఐఎస్‌టీ విభాగం ఈనెల 8 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో ఓటింగ్‌లను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ పోటీలో పాల్గొంటున్న స్టార్టప్‌లకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలు, నూతన వ్యాపార ఆలోచనలను తెలిపే వీడియోలను వీక్షించిన అనంతరం తమకు నచ్చిన స్టార్టప్‌లకు సామాన్య ప్రజలెవరైనా ఓటు వేయవచ్చు. అయితే ఒకరు రోజుకు ఒక స్టార్టప్‌కు మాత్రమే ఓటు వేయగలరు.

ఆన్‌లైన్‌లో ప్రజల నుంచి వచ్చిన ఓట్లు, నిపుణుల విశ్లేషణల ఆధారంగా జీఈఎస్‌లో జరిగే పోటీలో పాల్గొనే స్టార్టప్‌లను నిర్వాహకులు ఎంపిక చేస్తారు. కాంపిటిషన్‌లో పాల్గొనడం ద్వారా స్టార్టప్‌లు తమ వ్యాపార ఆలోచనలు, ఆవిష్కరణలను మరింత మెరుగైన రీతిలో ప్రతిపాదించడం, ప్రదర్శించడంలో నేర్పు సాధించేందుకు అవకాశం లభించనుంది. పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములను ఆకట్టుకునేలా తమ వ్యాపార ఆలోచనలను ప్రదర్శించడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాటుదేలేందుకు ఈ పోటీలు సహాయపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ఎన్నో పురస్కారాలు
పోటీల్లో మంచి ప్రదర్శనతో నిర్వాహకుల మనసులు గెలుచుకునే స్టార్టప్‌లకు ఎన్నో రకాల పురస్కారాలు లభించనున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరగనున్న స్టార్టప్‌ వరల్డ్‌ కప్‌–2018లో పాల్గొని ఒక మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకునేందుకు అవకాశం లభించనుంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్రెడిట్స్‌ అండ్‌ మెంటర్‌షిప్, అలైస్‌ డిజిటల్‌ యాక్సిలరేషన్, ఐఎన్‌సీ డాట్‌ మ్యాగ్జిన్‌లో ఎలిజబెత్‌ గోరెకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం, ఎయిర్‌ బీఎన్‌బీ క్రెడిట్స్, సీ5 యాక్సిలరేషన్, డెల్‌ ల్యాప్‌టాప్స్, గూగుల్‌ క్రెడిట్స్‌లను గెలుచుకోవచ్చు.

మరిన్ని వార్తలు