స్కూళ్ల ‘ఆన్‌లైన్‌’ మాయ!

15 Jun, 2020 02:26 IST|Sakshi

పాఠశాలల పునఃప్రారంభంపై స్పష్టత రాకున్నా ఫీజుల దందా

ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ప్రైవేటు యాజమాన్యాల వసూళ్లు

ఈ ఏడాది ట్యూషన్‌ ఫీజే తీసుకోవాలని ప్రభుత్వం చెప్పినా బుట్టదాఖలు

రవాణా సహా ఇతర ఫీజులన్నీ ట్యూషన్‌ కోటాలోనే చెల్లించాలని హుకుం

నేరుగా ఫీజులు పెంచిన మరికొన్ని స్కూళ్లు.. టీచర్లకు టార్గెట్లు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు, కార్పొరేటు, అంతర్జాతీయ పాఠశాలలు కరోనా కల్లోల సమయంలోనూ ఫీజుల దందాను ఆపట్లేదు. ఉద్యోగాలు పోయి కొందరు, జీతాల కోతలతో మరికొందరు సామాన్యులు లబోదిబోమంటున్నా స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం వసూళ్లకు వెనకడుగు వేయట్లేదు. పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాకముందే ఆన్‌లైన్‌ బోధన పేరిట భారీ మొత్తంలో ఫీజులు గుంజేందుకు సిద్ధమయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌తో గత విద్యా సంవత్సరం పూర్తికాకుండానే స్కూళ్లు మూతపడగా అప్పటి ఫీజు బకాయిలతోపాటు కొత్త ఫీజులపై దృష్టి పెట్టాయి. కొన్ని స్కూళ్లు నేరుగా ఫీజులను పెంచగా, మరికొన్ని స్కూళ్లు ట్యూషన్‌ ఫీజులో ఇతరత్రా ఫీజులను కలిపేసి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. స్కూళ్లే ప్రారంభం కాకముందు ఫీజులను ఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం ఫీజులు పెంచొద్దన్నా.. 
రాష్ట్రంలోని 10,547 ప్రైవేటు పాఠశాలల్లో పేరున్న, కార్పొరేట్, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు 2,500 వరకు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదివే 31 లక్షల మంది విద్యార్థుల్లో ఇలాంటి స్కూళ్లలోనే 40 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా వల్ల ప్రజలకు ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో స్కూలు ఫీజులు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పైగా ట్యూషన్‌ ఫీజును మాత్రమే తీసుకోవాలని, అదీ నెలవారీగానే తీసుకోవాలని తేల్చిచెప్పింది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ గత నెలలో జీవో 46ను జారీ చేసింది. అయినా కొన్ని స్కూళ్లు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఫీజులను పెంచగా మరికొన్ని స్కూళ్లు దొడ్డిదారిన అధిక ఫీజుల వసూళ్లకు చర్యలు చేపట్టాయి. లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్, కంప్యూటర్‌ ల్యాబ్, ఐక్యూ జీనియస్, ఫీల్డ్‌ ట్రిప్‌ ఫీజులను ట్యూషన్‌ ఫీజులోనే కలిపేసి ఆ మొత్తాన్ని చెల్లించాలని తల్లిదండ్రులకు హుకుం జారీ చేశాయి. దీనికితోడు పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతుల కోసం ట్యాబ్, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసుకోవాలని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం... 
ఆన్‌లైన్‌ పాఠాలంటూ కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు చేస్తున్న మాయాజాలం తమ పిల్లలకు పెద్దగా ఉపయోగపడట్లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వారు చెప్పేది అర్థంకాక, అప్పటికప్పుడు ప్రశ్నలు అడిగే పరిస్థితి లేక ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందంటున్నారు. గంటల తరబడి ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వాడకం వల్ల పిల్లల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని, అధిక రేడియేషన్‌ మెదడు నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతులు పిల్లల మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ పేర్కొంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ పాఠాలను నిషేధించింది. కానీ రాష్ట్రంలో ఆ దిశగా చర్యల్లేవు. 

టీచర్లకు జీతాలు ఎగనామం... 
కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు గుంజుతున్నా టీచర్ల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే దాదాపు లక్షన్నర మంది టీచర్లలో దాదాపు 70 వేల మంది ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు. వారికి ఏప్రిల్, మే వేతనాలను ఇవ్వని యాజమాన్యాలు ఇప్పుడు పాత, కొత్త ఫీజులు వసూలు చేయాలని వారికి టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేలా ఒప్పించే వారికి సగం వేతనాలను ఇస్తామని చెబుతున్నాయి. దీంతో టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలంటూ బతిమిలాడుకుంటున్నారు. 

సాధారణ స్కూళ్లపై ప్రభావం..
కార్పొరేట్‌ స్కూళ్ల ఆన్‌లైన్‌ మాయాజాలం ప్రభావం సాధారణ ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లపై తీవ్రంగా పడే ప్రమాదం నెలకొంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ఆన్‌లైన్‌ తరగతులంటూ ముందుకొచ్చిన కార్పొరేట్‌ స్కూళ్లవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ ప్రైవేటు స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లకు నష్టం జరగొచ్చు. అందుకే వాటిని కట్టడి చేయాలి. – యాదగిరి శేఖర్‌రావు, తెలంగాణ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు