ఆర్టీసీలో యూనిఫాంల కొరత

5 Aug, 2018 02:08 IST|Sakshi

నాలుగేళ్లు దాటినా అందని వైనం

సొంత డబ్బులతో కుట్టించుకుంటున్న సిబ్బంది

చెల్లించని కుట్టుకూలీ విలువ దాదాపు రూ.5.7 కోట్లు

అందని దుస్తులు దాదాపు 3 లక్షల జతలు

యూనిఫాం లేకుంటే వేధింపులు

సాక్షి, హైదరాబాద్‌: ఎండనకా.. వాననకా.. శ్రమించే కార్మికులు వారు. రుతువులతో సంబంధం లేకుండా.. ప్రజలందరినీ గమ్యస్థానాలకు చేర్చడమే వారిపని. ప్రగతి రథ చక్రాలను 24 గంటల పాటు నడిపిస్తూ ఆర్టీసీ మనుగడకు ఊపిరిగా నిలుస్తున్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులకు ఐదేళ్లుగా సంస్థ నుంచి యూనిఫాం అందట్లేదు. దీంతో ఇన్నేళ్ల నుంచి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కొనుక్కుని విధులకు హాజరవుతున్నారు.

నిబంధనల ప్రకారం రెండేళ్లకు మూడు యూనిఫాంలను సిబ్బందికి సంస్థ సరఫరా చేయాలి. (1.2 మీటర్ల ప్యాంటు, 2 మీటర్ల షర్ట్‌ క్లాత్‌). దాంతోపాటు కుట్టుకూలీ కింద రూ.200 చెల్లించాలి. చివరిసారిగా 2013లో సిబ్బందికి యూనిఫాంలు అందజేశారు. ఆర్టీసీ అధికారులను ఎప్పుడు అడిగినా.. ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నాం.. అంటున్నారే తప్ప ఆచరణలో విఫలమవుతున్నారు.

కాగా, ఇప్పటికే పలురకాల సమస్యలతో సతమతమవుతోన్న ఆర్టీసీ కార్మికులకు యూనిఫాం అదనపు భారంగా మారింది. సంస్థ ఇవ్వకపోవడంతో గత్యంతరంలేక వారే కుట్టించుకుంటున్నారు. అయితే ఈ దుస్తుల రంగుల్లో ఏకరూపత ఉండట్లేదు. ఒకే డిపోలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు ధరించే దుస్తుల ఖాకీ రంగుల్లో పలు రకాల వ్యత్యాసాలు ఉంటున్నాయి.  

ఎవరు బాధ్యులు?
52 వేల మందికిపైగా ఉన్న సంస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌ కార్యాలయం యూ నిఫారాలను ఇస్తుంది. ఇందుకు ముందుగా టెండర్లు పిలుస్తుంది. అందులో ఎంపిక చేసిన కాంట్రాక్టరు నుం చి నాణ్యమైన దుస్తులను ఎంపిక చేస్తుంది. గుర్తింపు యూనియన్‌ నుంచి నాణ్యత కమిటీ దుస్తుల మన్నికను పరిశీలిస్తుంది. వీరు సంతృప్తి వ్యక్తం చేశాక, ఆ వస్త్రాన్ని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం టెండర్ల వ్యవహారాలు ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) ఆధ్వర్యంలో జరుగుతుంది.

రిటైరైన వారి సంగతేంటి?
2014 నుంచి 2018 ఆగస్టు వరకు ఏటా వందలాది కార్మికులు రిటైరయ్యారు. ఈ సంఖ్య 4 వేలకుపైనే ఉండొచ్చని సమాచారం. వారంతా ఈ ఐదేళ్లకాలానికి యూనిఫాంను సొంత డబ్బుతోనే కుట్టించుకున్నారు. ఇప్పుడు వీరికి యూనిఫాం అలవెన్సులు అందుతాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. కాగా, ఐదేళ్ల కింద కుట్టుకూలీ కింద పురుషులకు ఒక్కోజతకు రూ.200, మహిళలకు రూ.100 చొప్పున చెల్లించాలి.

ప్రస్తుతం ఈ ధరకు మార్కెట్లో ఎవరూ దుస్తులు కుట్టరని కార్మికులు చెబుతున్నారు. కనీసం ఈసారైనా మెరుగైన కుట్టుకూలీ చెల్లించాలని కోరుతున్నారు. 2013లో చివరిసారిగా కార్మికులకు (కొన్నిచోట్ల మాత్రమే) దుస్తులు అందజేశారు. అప్పటినుంచి ఐదో ఏడాది రెండో త్రైమాసికం కూడా పూర్తి కావొస్తోంది. ఇప్పటికీ దుస్తులు అందలేదు. దాదాపు రూ.20 కోట్లకుపైగా కార్మికుల దుస్తులు, కుట్టుకూలీ రూపంలో సంస్థ మిగుల్చుకుందని విమర్శలు వస్తున్నాయి.

వేధింపులు సరేసరి..
ఆర్టీసీలో యూనిఫాంలు ఇవ్వట్లేదు. అయినా ఈ విషయంలో అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. యూనిఫాం ధరించకుండా విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీలు వేయట్లేదు. కొందరికి తాఖీదులు జారీ చేస్తున్నారు. మరికొందరిని మానసికంగా వేధిస్తున్నారు.


క్వాలిటీ కోసం అన్వేషణ  
తెలంగాణ ఏర్పడ్డాక విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా కార్మికులకు యూనిఫాం అందజేయలేకపోయాం. మంచి క్వాలిటీ దుస్తుల కోసం అన్వేషిస్తున్నాం. రెండు, మూడు నెలల్లో అందజేస్తాం.    – శివకుమార్, ఈడీఏ

దుస్తుల ఎంపిక జరుగుతోంది
యూనిఫాం ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. టెండర్లకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతం దుస్తుల ఎంపిక జరుగుతోంది. గుర్తింపు యూనియన్‌ నాయకులకు శాంపిల్స్‌ చూపిస్తున్నాం. త్వరలోనే అందజేస్తాం. – అజయ్‌కుమార్, చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌

మరిన్ని వార్తలు