కొట్టాడయ్యో లక్కీ చాన్స్‌

5 Aug, 2018 02:11 IST|Sakshi
కార్తికేయ

‘ఆర్‌ఎక్స్‌ 100’ పేరు చెబితే గతంలో బైక్‌ గుర్తొచ్చేది. ఇప్పుడు సినిమా గుర్తుకొస్తోంది. హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌లు ‘ఆర్‌ఎక్స్‌ 100’ బైక్‌లా ఇండస్ట్రీకి దూసుకొచ్చారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో కార్తికేయ, పాయల్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. కార్తికేయకు అయితే తమిళ ఇండస్ట్రీ పెద్ద నిర్మాత నుంచి కబురొచ్చింది. ‘తుపాకి, తేరి, కబాలి’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్‌.థాను బ్యానర్‌లో తెరకెక్కనున్న తెలుగు చిత్రంలో కార్తికేయ నటించనున్నారు. ఒక్క చిత్రంతోనే అంత పెద్ద నిర్మాతతో పనిచేసే అవకాశం రావడం లక్కీ చాన్సే అంటున్నారు సినీ జనాలు.

ఈ చిత్రానికి టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా రెండో పెద్ద ప్రాజెక్ట్‌కు పునాది పడింది. నాకు ఇష్టమైన ‘నువ్వు నేను ప్రేమ’ (సూర్య, జ్యోతిక నటించిన ‘జిల్లున్ను ఒరు కాదల్‌’కి డబ్బింగ్‌) సినిమా తెరకెక్కించిన టీఎన్‌ కృష్ణతో సినిమా చేయబోతున్నాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చూసి నా నటనను మెచ్చుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి అద్భుతమైన కథ వినిపించారు. లెజెండరీ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాత కావడం హ్యాపీ. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తారు’’ అన్నారు కార్తికేయ.

మరిన్ని వార్తలు