ఉస్మానయా..

24 Jan, 2020 10:32 IST|Sakshi

అందుబాటులోకి సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్‌ మెషీన్‌  

దాత నుంచి రక్తం బయటకు తీయకుండానే ప్లేట్‌లెట్ల సేకరణ

350 ఎంఎల్‌ ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తే.. ఒకేసారి 30 వేలకుపైగా పెరుగుదల  

ట్రయల్‌ రన్‌లో భాగంగా టెక్నీషియన్లకు శిక్షణ  

త్వరలోనే రోగుల దరిజేరనున్న సేవలు  

సాక్షి, సిటీబ్యూరో: డెంగీ జ్వరాలతో బాధపడుతూ చికిత్స కోసం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి చేరుకునే రోగులకు శుభవార్త. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్‌లెట్ల కోసం ప్రైవేట్‌ రక్తనిధి కేంద్రాల వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇందుకు పెద్ద మొత్తంలో చెల్లింపు చేయాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో డెంగీ జ్వరాల తీవ్రత, ఆస్పత్రికి చేరుకుంటున్న రోగుల అవసరాల దృష్ట్యా ఇకపై ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలోనే సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్‌ మెషీన్‌ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆ మేరకు అత్యాధునిక ఎస్‌డీపీ మెషీన్‌ను దిగుమతి చేసుకుని ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుతం టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తోంది. త్వరలోనే ఈ సేవలను  పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక ఈ ఎస్‌డీపీ మిషన్‌ అందుబాటులోకి రావడం వల్ల డోనర్‌ నుంచి రక్తం బయటికి తీయకుండా నేరుగా ప్రాసెస్‌ చేసే అవకాశం ఉంది. రోగికి 350 ఎంఎల్‌ ప్లేట్‌లెట్స్‌ ఎక్కించడం వల్ల వాటి సంఖ్యను ఏకకాలంలో 30 వేలకుపైగా పెంచొచ్చు. ఆర్‌డీపీ ద్వారా సేకరించిన ప్లేట్‌లెట్స్‌తో పోలిస్తే.. ఎస్‌డీపీ నుంచి ప్రాసెస్‌ చేసిన ప్లేట్‌లెట్స్‌ ఎక్కించడం వల్ల రోగి కోల్పోయిన ప్లేట్‌లెట్ల సంఖ్యను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంది. అంతేకాదు ఇకపై పేద రోగులు ప్లేట్‌లెట్ల కోసం ప్రైవేటు రక్తనిధి కేంద్రాల వెంట పరుగెత్తాల్సిన అవ సరం కూడా లేదు.    

అవగాహన లేమి.. చికిత్సల్లో నిర్లక్ష్యం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెంగీ జ్వరాలు పెద్ద మొత్తంలో నమోదయ్యాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు కిటకిటలాడాయి. ఒకానొక దశలో ఆయా ఆస్పత్రుల్లో అడ్మిషన్లు కూడా దొరకని దుస్థితి తలెత్తింది. గాంధీ, నిమ్స్, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో ఈ సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ మిష న్లు ఉన్నప్పటికీ...వాటిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్‌లెట్స్‌ కోసం రోగుల బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఉస్మానియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో చాలా వరకు మూడు, నాలుగో స్టేజ్‌లో వస్తున్న వారే అధికం. పేద ప్రజల్లో డెంగీ జ్వరాలపై సరైన అవగాహాన లేకపోవడం, సాధారణ జ్వరంగా భావించి చికిత్సలను నిర్లక్ష్యం చేయడం వల్ల రక్తంలో ప్లేట్‌లె ట్స్‌ కౌంట్‌ పడిపోయి రోగనిరోధక శక్తి తగ్గుతోంది.

40 వేలలోపు బాధితులే అధికం
నిజానికి మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. జ్వర పీడితుల్లో ఈ కౌంట్‌ తగ్గుతుంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న చాలామంది రోగుల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 40వేల లోపే ఉంటోంది. వాస్తవానికి 25వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్‌ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్‌ అయితే వెంటనే ప్లేట్‌లెట్స్‌ పునరుద్ధరించాలి. లేదంటే షాక్‌కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని తొలుత గ్రూపులుగా విభజించి, ఆ తర్వాత ర్యాండమ్‌ పద్ధతిలో ప్రాసెస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దీని నుంచి ప్లాస్మా, పీఆర్‌పీ, ఎస్‌డీపీ, ఆర్‌బీసీ వంటి సెల్స్‌ను వేరుచేసి ప్యాకెట్‌లో నిల్వ చేస్తున్నారు. అదే సింగిల్‌ డోనర్‌ మెషీన్‌లో ఇంత పెద్ద ప్రాసెస్‌ అవసరం ఉండదు. దాతను నేరుగా మెషీన్‌కు అనుసంధానం చేసి, అవసరమైన ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే సేకరించే అవకాశం ఉంది. ఒకే సమయంలో 2000 ఎంఎల్‌ రక్తాన్ని ప్రాసెస్‌ చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ముప్పైవేలకుపైగా ప్లేట్‌లెట్స్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు