మీ ఐడియా నచ్చితే రూ.ఆరుకోట్లు మీకే..

1 Aug, 2014 04:48 IST|Sakshi
మీ ఐడియా నచ్చితే రూ.ఆరుకోట్లు మీకే..

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. మహీంద్రా సంస్థ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆలోచనల్ని వెలికి తీసేందుకు ‘రైజ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద సాంకేతిక పోటీని నిర్వహిస్తోంది. అక్షరాలా ఆరు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ ఇస్తోంది. మరి అందుకోవడానికి మీరు సిద్ధమా..!  
 
ముఖ్య ఉద్దేశం: అమెరికాలో ఏటా వందల కొద్దీ ఇంజినీరింగ్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అందులో 33 శాతం సంస్థల్లో సహ వ్యవస్థాపకులు భారతీయులే. ఆ ఎన్నారైలంతా మన దేశంలోనే పనిచేస్తే అతి తక్కువ కాలంలోనే భారత్ అగ్రదేశంగా మారుతుందనేది నిపుణుల మాట. ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకూ ‘రైజ్’ పోటీని నిర్వహిస్తోంది మహీంద్రా సంస్థ. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి, సృజనాత్మకతను జోడించి సమస్యలకు పరిష్కారం చూపించడమే దీని ముఖ్య ఉద్దేశం.
 
దరఖాస్తుల స్వీకరణ మొదలైంది

అభివృద్ధితో పాటు కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. మన దేశంలో విద్యుత్తు, ట్రాఫిక్ సమస్యలూ అలాంటివే. అందుకే ఈ రెండు రంగాలనే ఈ ఏడాది పోటీకీ ప్రధాన అంశాలుగా ఎంచుకున్నారు. దేశంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ‘డ్రైవర్ లెస్ కార్లు’ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనేందుకూ, వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సోలార్ విద్యుత్తును చేరువ చేసేందుకు అనువైన పద్ధతులను కనిపెట్టేందుకు యువతకు స్వాగతం పలికారు.
 
అప్లికేషన్ల స్వీకరణ ఇలా..

మీ దగ్గర దేశ భవిష్యత్తును మార్చేయగల ఆలోచనలున్నాయా..! అయితే http://www.sparktherise.com/లోకి ప్రవేశించి మీ దరఖాస్తును వెంటనే పంపించండి.
 
ఎంపికైన వారికి ప్రతి దశలోనూ సాయం అందుతుంది.
 
ప్రాజెక్ట్ ఒక్కో దశనూ దాటే కొద్దీ ప్రతి జట్టుకూ అవసరమైన గ్రాంటు అందుతుంది.
 
ఆల్ ది బెస్ట్     

మరిన్ని వార్తలు